మత భావజాలంతో దేశం విచ్ఛిన్నం

మత భావజాలంతో దేశం విచ్ఛిన్నం
  • కేంద్రమంత్రివర్గంలో ఒక్క ముస్లిమ్ మైనారిటీ లేరు
  •  సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ
  •  'మెఫి టేక్స్' లో పరకాల ప్రభాకర్ 

ముద్ర, తెలంగాణ బ్యూరో: మత భావజాలం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదని, మతతత్త్వ శక్తులను నిలువరించేలా పౌర సమాజం నిలబడాలని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు.  భారత దేశ స్వాతంత్ర్య సమరంతో సంబంధం లేకుండా  నేడు దేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు మత భావజాలం కలిగిన వ్యక్తులు పెద్ద ప్రయత్నం చేస్తున్నారని  ఆయన ఆరోపించారు. ఒక మతానికి చెందిన దేశంగా భారత్ ను మార్చడానికి జనం చేత ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. మతాన్ని పటిష్టంగా ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి రకరకాల ప్రయోజనాలు ఆశించే  ఓ వర్గం మద్దతు పలుకుతుందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో మన దేశ చరిత్ర, ఉనికిపై  పూర్తిగా భిన్న భావనలు కల్పించే ప్రయత్నం జరుగున్నదని ఆయన చెప్పారు. దేశానికి లౌకికవాదం మూలస్తంభం అని  వివరిస్తూ..  ఈ రోజు కేంద్రమంత్రి వర్గంలో ఒక్క ముస్లిమ్ మైనారిటీ వ్యక్తి లేరన్నారని పరకాల చెప్పారు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క ముస్లిమ్ వ్యక్తికి కూడా బీజేపీ టికెట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ దేశంలో 18 నుంచి 20 శాతం ఉన్న మైనారిటీలకు రాజికీయ, ఆర్ధిక, చట్ట వ్యవస్థలలో నిలువనీడ లేకుండా చేస్తున్నారని పరకాల ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర సమరంతో ఎంత మాత్రం సంబంధం లేని వ్యక్తులు ఈరోజు దేశభక్తులుగా చెలామణి అవుతుండటం దురదృష్టకమన్నారు. శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా  (ఎంఈఎఫ్ఐ) ఆధ్వర్యంలో  ''భారత గణతంత్రం ఎదుర్కొంటున్న సంక్షోభం- విశ్లేషణ'' అనే అంశంపై చర్చ జరిగింది. ఐజెయు జాతీయ అధ్యక్షుడు, మెఫి చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పరకాల ప్రభాకర్ పాల్గొన్నారు. మెఫీ ట్రస్టీ, స్క్రైబ్స్ న్యూస్ ఎడిటర్ ఆలపాటి సురేష్ కుమార్ తొలుత స్వాగతం పలికారు. 

పరకాల ప్రభాకర్ ను సభకు పరిచయం చేశారు. సబ్జెక్టు గురించి వివరించారు. ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా  సలహాదారు, మెఫి మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్, మెఫి ట్రస్టీలు వై. నరేందర్ రెడ్డి, కే. విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.  అనంతరం పరకాల ప్రభాకర్  భారత దేశ పరిస్థితులపై  తాను రచించిన "  "క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా" ( నవీన భారత్ లో వంకరటింకర కలప) పుస్తకంలోని అంశాలను ప్రస్తావించారు. మన దేశ గణతంత్ర రాజ్య వ్యవస్థ,  సమాజం, సంస్కృతి, విలువలు, విద్యాబోధన సహా అన్ని వ్యవస్థలు పెద్ద సంక్షోభంలో  చిక్కుకున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యం, దేశ ఐక్యత ఏమైపోయిందనే అంశాలపై తనకు తోచిన సమాధానాలను క్రుకూడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తకం ద్వారా ప్రజా బాహుళ్యంలో ఉంచానన్నారు. అందరూ మెచ్చే అంశాల కంటే ఆందోళన చెందాల్సిన అంశాలు అనేకం దేశంలో ఉన్నాయన్నారు. ప్రధాన సమస్య ఏమిటో గుర్తించి లోటుపాట్లను ప్రజల ముందు పెట్టడం తన బాధ్యత అని చెప్పారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న తప్పొప్పులను ఎత్తిచూపుతూ ఇది నా ఆలోచన అనే విషయాన్ని పుస్తకంలో వివరించాన్నారు. ఎప్పుడుకప్పుడు దేశంలో జరుగుతోన్న పరిణామాల గురించి మెచ్చుకుంటూ, సమస్యల గురించి విమర్శలు చేసి ఆ తర్వాత మర్చిపోతున్నామని అన్నారు. ఒరిస్సా రైలు ప్రమాదం గురించి మరిచిపోయామని, అయితే ప్రస్తుతం మణిపూర్ లోని మారణహోమం రగులుతున్నప్పటికీ పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.  

1990 నుంచి 75 మిలియన్ల భారతీయులు పేదరికంలోకి దిగజారిపోయారని పరకాల ప్రభాకర్ చెప్పారు. దేశంలోని 60 శాతం మంది పేదరికంలోకి వెళ్ళిపోగా, నూటికి 25 మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పారు. తగిన ఆదాయం, ఉపాధి కరువై గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుదేలైపోయిందన్నారు. ఆదాయం తగ్గిపోయిన  గ్రామీణ జనాభాలో అధికశాతం మంది ఉపాధి హామీ కూలి పనుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. మూడు నాలుగు కోట్ల మంది రైతులు వ్యవసాయం విడిచిపెట్టి కూలి పనులకు వెళ్తున్నారని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్ళే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న వారిలో స్త్రీలే ఎక్కువగా ఉన్నారన్నారు. స్థూలంగా చెప్పాలంటే భారత్ ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో ఉందన్నారు. సుమారు వంద లక్షల కోట్లకు పైగా అప్పు దేశానికి ఉందన్నారు. అలాగే 12 లక్షల కోట్ల మేర పారిశ్రామికవేత్తల అప్పులను దేశంలో  మాఫీ చేయడం గమనించాలన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో పరోక్ష పన్నుల శాతం అధికంగా ఉందన్నారు. ప్రత్యక్ష పన్నులను 23 శాతం నుంచి 19 శాతానికి తగ్గించారన్నారు.  ఒకప్పుడు పత్రికల్లో  సమస్యలపై మంచి వార్తలు ప్రచురితమయ్యేవని, ఇప్పడు పనికి రాని వార్తలు లక్షల్లో పబ్లిష్ అవుతున్నాయని అన్నారు. పనికిరాని వార్తలు కంటే మణిపూర్ సమస్య, నిరుద్యోగుల సమస్య, ధరల పెరుగుదల వంటి సమస్యలను ఎక్కువగా ఫోకస్ చేయాలని ఆయన సూచించారు. దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనే సరైన లెక్కలు కూడా ప్రభుత్వాల వద్ద లేవన్నారు. ఐజెయు జాతీయ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెలా ఒక సమకాలీన సమస్యపై మెఫి చర్చా గోష్టులు నిర్వహించి ప్రజల్లోకి  సమాచారాన్ని తీసుకెళ్తున్నదని చెప్పారు.  రాజ్యాంగ స్ఫూర్తిని మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని విమర్శించే వారు ఉన్నారన్నారు. పరకాల ప్రభాకర్ రచించిన క్రూకుడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తకం విమర్శనాత్మకంగా ఉందన్నారు.