పంట కాలాన్ని నెల ముందుకు తేవాలి

పంట కాలాన్ని నెల ముందుకు తేవాలి

వానకాలం వరిపంట పై సిద్ధిపేట జిల్లా వ్యవసాయ అధికారులు, రైతులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్

ముద్ర ప్రతీ నిధి : సిద్ధిపేట: యాసంగి పంట కోసే సమయంలో అకాల వర్షం, వడగళ్ల వాన వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నది. కాబట్టి వరి పంట సాగు కాలాన్ని ఒక నెల ముందు తీసుకువస్తే అకాల వర్షం, వడగళ్ల వానలతో నష్టం జరగకుండా ఉంటుంది. ఇందుకు గానూ రోహిణి కార్తీలోనే రైతులంతా వరి నారు పోసుకుని జూలై నెల 15 లోపు వరి నాట్లు వేసుకున్నట్లయితే అక్టోబర్ నెల చివరి కల్లా వరి కోతలు పూర్తవుతాయి. దీంతో రైతులు వడగండ్ల వర్షాలు, అకాల వానల బారి నుండి తప్పించుకోవచ్చునని పంట కాలాన్ని నెల ముందుకు తేవాలని నేరుగా రైతులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. ఆదివారం రోజున వానకాలం వరిపంట పై సిద్ధిపేట జిల్లా వ్యవసాయ అధికారులు,నేరుగా రైతులతో మంత్రి హరీశ్ రావు  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెద సాగు చేయడం ద్వారా కూడా వరి పంట సాగును 15 రోజులు ముందుకు తీసుకు పోవచ్చునని, కూలీల కొరతను కూడా తగ్గించుకోవచ్చునని రైతులకు అవగాహన కల్పించారు. 

రైతులు వరి పంట కోసిన తర్వాత కొయ్య కాలును తగల బెట్టడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు భూమిలో భూసారాన్ని పెంచి పంటకు లాభం చేకూర్చే వాన పాములు చనిపోయే అవకాశాలు ఉంటాయని, వరి అవశేషాలను (కొయ్యకాళ్ళను) కాల్చడం వల్ల భూమికి లబ్ధి చేకూర్చే  సేంద్రియ కర్భణం తగ్గే అవకాశం ఉంటుందని, అందువల్ల కాల్చకుండా భూమిలోనే కలియదున్నాలని  పిలుపునిచ్చారు. రైతులు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై మొగ్గు చూపాలని ఆయిల్ పంటలను సాగు చేసి యేటా ఎకరాకు లక్ష రూపాయల లాభాలను పొందే అవకాశం ఉందని తెలియజేశారు.  భూసారాన్ని పెంచే పచ్చిరొట్టె పైరులైన  జనుము  జీలుగ ప్రభుత్వం 65% సబ్సిడీపై ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకోవాలని మంత్రి కోరారు.