ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు అద్భుతం

ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు అద్భుతం
  • హెల్త్ సెక్టార్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయం
  • ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ కు పూర్తిస్థాయిలో సహకరిస్తాం
  • ఆరోగ్య భార‌త్‌, న‌వ భార‌త నిర్మాణం వికసిత్ భారత్ సంకల్పయాత్ర లక్ష్యం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు
  • పాత జీజీహెచ్ లో 2 క్రిటికల్ కేర్ బ్లాక్స్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన.. 7 ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్ ప్రారంభం
  • కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు మరియు ఎరువుల శాఖామాత్యులు శ్రీ. మన్‌సుఖ్ మాండవీయ
ముద్ర ప్రతినిధి, విజయవాడ: ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు మరియు ఎరువుల శాఖామాత్యులు శ్రీ. మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పర్యటనలో భాగంగా విజయవాడలోని పాత ప్రభుత్వాస్పత్రిలోని రూ.25 కోట్లతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తగా నిర్మించిన 7 ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్ ప్రారంభించారు. 
అనంతరం.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో ఉన్న భారత్ నిర్మాణ్ సేవా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను మన్ సుఖ్ మాండవీయ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను పరిశీలించారు. ఆ తర్వాత ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ సభా కార్యక్రమంలో పాల్గొన్నారు.    

ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రట‌రీ శ్రీ. అశోక్‌బాబు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖామంత్రి శ్రీమతి. విడదల రజిని, విజయవాడ ఎంపీ శ్రీ. కేశినేని నాని, అనకాపల్లి ఎంపీ శ్రీమతి. సత్యవతి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ. మల్లాది విష్ణు, నగర మేయర్ శ్రీమతి. రాయన భాగ్యలక్ష్మీ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ శ్రీ. ఎం.టి. కృష్ణబాబు, కమిషనర్ శ్రీ. జె.నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ శ్రీ. మురళీధర్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ. ఎస్. ఢిల్లీరావు, ఐఏఎస్‌లు స్వప్నిల్ దినకర్ పుండ్కర్, భావన, అశోక్, లత గణపతి, సబ్ కలెక్టర్ అదితి సింగ్, జేసీ రాజకుమారి, మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ డా. నరసింహం, డీఎంహెచ్‌వో డా. ఎం. సుహాసిని, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా.డి.వెంక‌టేష్‌, వైద్యాధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.  
 ఈ సందర్భంగా మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. హెల్త్ సెక్టార్ పై ఏపీ ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని.. ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం వైద్య ఆరోగ్యరంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1.70 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. 10 రకాల పరీక్షలు వీటిలో అందుబాటులో ఉంటాయని.. పెద్ద అనారోగ్య సమస్యలకు సైతం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు లభిస్తున్నాయన్నారు. దేశంలో 67 ఏళ్ల కాలంలో 350 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఆ సంఖ్య ఈ 9 ఏళ్లలోనే 707కు చేరిందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా 54 వేలు ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ప్రస్తుతం లక్షా ఏడు వేలకు పెరిగాయన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందించడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందయనీయ ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ వైద్య రంగ పనుల మంజూరుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ సత్యవతి, స్పెషల్ సీఎస్ శ్రీ. ఎం.టి. కృష్ణబాబు చేసిన కృషి అభినందయనీయమన్నారు.
 రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి శ్రీమతి. విడదల రజిని మాట్లాడుతూ.. కేంద్ర, ప్రభుత్వ స‌హ‌కారంతో రాష్ట్ర వైద్య రంగ మౌలిక వ‌స‌తుల‌ను బ‌లోపేతం చేసే క్రమంలో క్రిటిక‌ల్ కేర్ బ్లాక్‌ల‌కు, బీఎస్ఎల్‌-3 ల్యాబ్ కు శంకుస్థాప‌న చేయడం సంతోషకరమన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా 7 ఇంటిగ్రేటెడ్ ప‌బ్లిక్ హెల్త్ ల్యాబ్ లను ప్రారంభించడం ఆనందంగా ఉంద‌న్నారు. దేశ వ్యాప్తంగా ప‌ది బీఎస్ఎల్-3 ల్యాబ్‌లు మంజూరు చేస్తే వాటిలో ఒక ల్యాబ్‌ను రాష్ట్రానికి మంజూరు చేసినందుకు కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయకు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య రంగంలో ఎదురయ్యే స‌వాళ్లను  ఎదుర్కొనేందుకు ఈ బీఎఎస్ఎల్-3 ల్యాబ్‌లు దోహ‌దం చేస్తాయ‌న్నారు. దీనికితోడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజు నుంచి ఎంతో కృషిచేస్తున్నార‌ని స్పష్టం చేశారు. రూ. 25 ల‌క్షల వ‌ర‌కు ఉచితంగా వైద్య సేవ‌లు అందించే డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నట్లు తెలిపారు. రూ.8,480 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని.. వీటిలో ఇప్పటికే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగిందన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరించడంతో పాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతోందన్నారు. భార‌త్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాల‌నే విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప సిద్ధి దిశ‌గా ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప‌య‌నిస్తోంద‌ని విడ‌ద‌ల ర‌జ‌ని స్పష్టం చేశారు. 
పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని ) మాట్లాడుతూ.. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి  ఒక్కరికి ప్రస్తుతం అనారోగ్యమఅనేది పెద్ద సమస్యగా మారిందన్నారు. కోవిడ్ అనంతరం ప్రధాని మోదీ  ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీనిలో భాగంగా విజయవాడలో పాత ప్రభుత్వ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ద్వారా ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీ. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వైద్య రంగం పట్ల  ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందన్నారు. నాడు -నేడు కార్యక్రమం ద్వారా ప్రతి పేదవానికి అత్యాధునిక వైద్య సేవలు అందించే వ‌స‌తుల‌ను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. 
 రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ శ్రీ. ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (ABHIM) ద్వారా రోగ నిర్ధారణ సేవలతో పాటు చికిత్సకు సంబంధించిన అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. కోవిడ్ అనంతరం భవిష్యత్తులో ఆరోగ్యం ప‌రంగా ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట‌వుతున్న 14 క్రిటికల్ కేర్ బ్లాక్‌ల‌తో పాటు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీస్ (IPHL), బయో సేఫ్టీ లెవెల్-3 (BSL-3) లేబరేటరీలతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. పీఎంజేఏవై ద్వారా రూ.5 లక్షల వరకు, డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు లభిస్తాయన్నారు. ఇప్పటికే క్యాన్సర్ వంటి వ్యాధులకు ఎంత ఖర్చయినా పూర్తి ఉచితంగా చికిత్స అందించడం జరుగుతోందన్నారు.  
ఈ సందర్భంగా పాత జీజీహెచ్ ప్రాంగణంలో, మామిళ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నేతృత్వంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ సందర్శించారు. జ్యోతిప్రజ్వల‌న చేసి కార్యక్రమాల‌ను ప్రారంభించారు. మామిళ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి మాండవీయ హిందీ ప్రసంగాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ శ్రీ. ఎం.టి. కృష్ణబాబు తెలుగులోకి అనువదించి చెప్పారు. అనంతరం.. స్వచ్ఛ భారత్ గీతానికి పలువురు విద్యార్థినులు చేసిన నృత్యం వీక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా.. కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయను శాలువా, మెమెంటోతో మంత్రి విడదల రజిని, స్పెషల్ సీఎస్ ఎం.టి కృష్ణబాబు సన్మానించారు. మంత్రి విడదల రజినిని కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ శాలువా, మెమెంటోతో సన్మానించారు. ఐఏఎస్‌లు అశోక్, లత గణపతిలను కూడా స్పెషల్ సీఎస్ ఎం.టి. కృష్ణబాబు శాలువా, మెమెంటోతో సన్మానించారు.