ఇరిగేషన్ శాఖలో దొంగలు పడ్డారు

ఇరిగేషన్ శాఖలో దొంగలు పడ్డారు
  • కంప్యూటర్లు, విలువైన డాక్యుమెంట్స్ మాయం
  • రంగంలోకి పోలీసులు
  • దొంగతనం వెనక కుట్ర కోణం ఉందా?

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం లోని ఎల్ఎండి కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయం లోని విలువైన కంప్యూటర్ల తో పాటు పలు దస్త్రాలు చోరీ చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. సాధారణంగా దొంగలు ఇళ్లలో చోరికి పాల్పడుతూ డబ్బులు, విలువైన ఆభరణాలు చోరీ చేసుకొని వెళ్లడం వింటుంటాం అయితే ప్రభుత్వ కార్యాలయంలో కంప్యూటర్లు, సీపీయూ లు, ఇతర విలువైన దస్త్రాలు దొంగలించడం ఇది దొంగల పనా లేక ఏదైనా విలువైన సమాచారం కోసం చోరీ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విలువైన సమాచారాన్ని దొంగలించి ఏదైనా కుట్రకు పాల్పడడమో లేక ఏదైనా తప్పిదం జరిగితే దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఎవరైనా ఈ పని చేశారా..? అనే అనుమానాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.

ఎల్ఎండి కాలనీలోని నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాలయంలో ఈ నెల 7 వ తేదీన ఆదివారం కావడంతో సాయంత్రం ఆఫీసుకు ఉన్న గొల్లాన్ని పగలగొట్టి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు  5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డాటా, వివిధ సామాగ్రి తో పాటు దస్త్రాలు దొంగలించుకు వెళ్లినట్లు సమాచారం. కంప్యూటర్లలో ఎల్ఎండి ప్రాజెక్టుకు సంబంధించిన డాటా తో పాటు క్యాంపు క్వార్టర్ల సమాచారం, కార్యాలయ పరిధిలోని సిబ్బందికి సంబంధించిన డాటా కంప్యూటర్ లో భద్రపరుస్తామని ఆ కంప్యూటర్ లు మాత్రమే చోరీకి గురయ్యాయని అలాగే బీరువా ను పగలగొట్టి వివిధ ఫైళ్లను కూడా దొంగలించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.  చోరికి గురైన సామాగ్రి విలువ రూ. 2.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ విషయమై కార్యాలయ సూపరింటెండెంట్ అంజిరెడ్డి సమాచారం అందించడంతో ఎస్సై చేరాలు కార్యాలయానికి చేరుకొని సిబ్బందితో కలిసి కార్యాలయంలో దొంగిలించిన కంప్యూటర్లు వివిధ సామాగ్రి తో పాటు ఇంకా ఏమి దొంగతనానికి గురయ్యాయని పరిశీలించారు.

కార్యాలయంలో కొంత కాలం క్రితం అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికి అవి కొద్దీ రోజులుగా పని చేయడం లేదని తెలిసింది. ఈ విషయమై అధికారులను పోలీసులు వివరాలు కోరగా సీసీ కెమెరాలు  కొంతకాలంగా పనిచేయడం లేదని చెప్పినట్లు సమాచారం. కార్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో  అక్కడికి చేరుకొని పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీం కు సమాచారం అందించడంతో సోమవారం క్లూస్ టీం కార్యాలయానికి చేరుకొని వేలిముద్రలు సేకరించారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చేరలు తెలిపారు.

దొంగల పనా..? లేకా తెలిసిన వారేనా..?
దొంగలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన సందర్భాల్లో డబ్బులు, ఇతర విలువైన ఆభరణాలు చోరీ చేస్తారు కానీ నీటిపారుదల కార్యాలయం లో మాత్రం కంప్యూటర్లు, దస్త్రాలు చోరీ చేయడం చర్చనీయంశం అయింది. ముఖ్యమైన దస్త్రాలు, కంప్యూటర్లు చోరికి గురి కావడం దొంగల పనా..? లేక తెలిసిన వారి పనా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్థలిని పరిశీంచిన ఏసీపీ కర్ణాకర్ రావు చోరీ ఘటనను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.