గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం
  • కెసిఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేం
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం అని , కెసిఆర్ చేతిలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్దుంపూర్, చర్ల బుత్కుర్ కు చెందిన యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరగా మంత్రి గంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాడు సమైక్య పాలనలో పక్కనే గోదావరి పారినా మన పొలాల్లోకి చుక్కా నీరు రాని పరిస్థితి ఉండేదని, గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేయాలంటే ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితులు ఉండేవనీ గుర్తు చేశారు. సమైక్య పాలకులు ఇక్కడి నీరు, బొగ్గు, కరెంటు, సంపదను దోచుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ప్రభుత్వాలు మారాయే తప్ప గ్రామీణ ప్రాంతాల ప్రజల బతుకులు మారలేదనీ అన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కోటి రూపాయలు కావాలని నాటి సీఎం లను అడిగితే వెకిలిగా నవ్వారే తప్ప ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు.  కర్షకుడే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగితే ఎలా ఉంటుందో కేసీఆర్ చూపెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి  మండుటెండల్లో చెరువులు మత్తడి దూకిస్తున్నామని అన్నారు.  ప్రతి ఇంచు భూమికి సాగు నీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసామని, గతంలో నీళ్లు ఉన్నప్పటికీ రైతులకు ఇవ్వాలన్న మనసు సమైక్య పాలకులకు రాలేదని చెప్పారు. దేశంలో పండిన ప్రతీ గింజను కొనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఇది ఎన్నికల సంవత్సరం అని మళ్లీ ఒక అవకాశం ఇవ్వండి అంటూ కాంగ్రెస్ బిజెపిలు మళ్ళీ వస్తున్నాయనీ, కాంగ్రెస్ బిజెపి పాలిత రాష్ట్రాల్లో స్కామ్ లు  తప్ప తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించవు అని అన్నారు.  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రిమోట్ ఢిల్లీ నాయకుల వద్ద ఉంటే కెసిఆర్ కు మాత్రం తెలంగాణ ప్రజలే రిమోట్ అని అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో మత ఘర్షణలు కర్ఫ్యూలతో భయాందోళన కలిగించే పరిస్థితులు ఉండేవనీ అన్నారు. కెసిఆర్ లేని తెలంగాణ ను ఊహించుకుంటే మళ్ళీ ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తాయనీ, మనం పడిన కష్టం భవిష్యత్ తరాలు పడొద్దంటే అభివృద్ధి కొనసాగాలి. కెసిఆర్ చేతులను బలోపేతం చేయాలనీ పిలుపునిచ్చారు.

ఈ చేరికల్లో మగ్ధుంపూర్ నుండి వార్డు సభ్యులు వెంకటేష్, హిందూ వాహిని మండల అధ్యక్షుడు మైలారం రామ్, హిందూ వాహిని గ్రామ అధ్యక్షుడు కారేపు సాయికుమార్, బాలు, అన్వేష్, శ్రీనివాస్ సతీష్, మహేష్, రాకేష్, రమేష్ వినయ్ అజయ్ చర్ల బూత్కూరు నుండి పంది శ్రీకాంత్ అఖిల్ శివకిరీటి అభిలాష్ అశోక్ మధుకర్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, రూరల్ అధ్యక్షులు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, బండారి వేణు తదితరులు పాల్గొన్నారు.