హాస్యానికి సహజత్వం...బట్టల సత్యం

హాస్యానికి సహజత్వం...బట్టల సత్యం

నేడు మల్లిఖార్జునరావు వర్ధంతి (2008 జూన్ 24)

సినిమాల్లో కొందరు నటులు పోషించే పాత్రలు ఎంతటి సెన్షేషన్ క్రియేట్ చేస్తాయో తెలిసిన విషయమే. ఆయా పాత్రలకు వారికి వచ్చిన గుర్తింపు వారి సినీ ప్రయాణానికి వారధిలా నిలుస్తూంటాయి. అదే పేరు తమ్ స్క్రీన్ నేమ్ గా వారు కూడా ఊహించలేనంతగా.. వారి ప్రమేయం లేకుండానే సెట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వారిలో మల్లికార్జున రావు కూడా ఒకరు. మల్లికార్జున రావు ఎవరు.. అనే సందేహం రావచ్చు గానీ.. ‘బట్టల సత్తిగాడు’ అంటే మాత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చేశారు ఆ హాస్యనటుడు. 1986లో వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన లేడీస్ టైలర్ సినిమా ఆయన సినీ జీవిత గమనాన్ను మార్చేసింది. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సినిమా ఆద్యంతం ఎంత కామెడీ ఉంటుందో బట్టల సత్తి పాత్రకు అంత ప్రాధాన్యం ఉంటుంది.

పల్లెటూళ్లో సైకిల్ మీద ఇంటింటికీ తిరుగుతూ బట్టలు అమ్మే వ్యక్తి పాత్ర అది. ఆ ఊరిలో ఉన్న ఏకైక టైలర్ సుందరంతో ఒప్పందం కుదుర్చుకుని ఇబ్బందులు పడే కామెడీ క్యారెక్టర్ లో మల్లికార్జున రావు జీవించారనే చెప్పాలి. ఆ సినిమాతో రాజేంద్రప్రసాద్ స్టార్ హీరో అయిపోతే.. మల్లికార్జున రావు బట్టల సత్తిగా అంతే పాపులర్ అయిపోయి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం తర్వాత మల్లికార్జున రావు తిరిగి చూసింది లేదు. ఎన్నో సినిమాల్లో అత్యద్భుతమైన కామెడీ చేశారు. ఏప్రిల్ 1 విడుదల, హలో బ్రదర్, తమ్ముడు, బద్రి.. ఇలా ఎన్నో సినిమాల్లో తన పాత్రకు న్యాయం చేశారు. దాదాపు 375 సినిమాల్లో నటించిన ఆయన 2008లో అనారోగ్యంతో మరణించారు. తన హాస్యంతో నవ్వించి.. తన మరణంతో ప్రేక్షకులందరినీ బాధకు గురి చేసారు.

"ఒక‌సారి రామారావుగారు 'శ్రీ‌నాథ క‌విసార్వభౌమ'లో వేషం గురించి న‌న్ను చూపించి బాపు గారిని అడిగారు.. "వీరు మీకు తెలుసా.. అవార్డులేవో చాలా వ‌చ్చాయంట వీరికి." అని. "వీరు మాకు తెలియ‌క‌పోవ‌డం ఏమిటండీ.. బ‌ట్టల స‌త్యం కదండీ" అన్నారు బాపుగారు. "వీరి పేరు వేరే ఉంది క‌దా" అని రామారావు గారు అన్నారు. "కాదండీ..ఈయ‌న చేత‌ 'లేడీస్ టైల‌ర్' అనే సినిమాలో డైరెక్టర్ వంశీ బ‌ట్ట‌ల స‌త్యం అనే క్యారెక్టర్ చేయించారు. అది జ‌నంలోకి బాగా దూసుకుపోవ‌డంతో ఇండ‌స్ట్రీలోనూ, బ‌య‌టా ఈయ‌న‌ను బ‌ట్ట‌ల స‌త్యం అంటే ఈజీగా తెలుస్తుంది." అని చెప్పారు బాపు. అప్పుడు మ‌హానుభావుడు ఎన్టీఆర్ గారు ఓ గొప్పమాట‌న్నారు.. "వెరీ గుడ్ బ్రద‌ర్‌.. ఇది ప‌ద్మశ్రీ‌ల కంటే గొప్ప బిరుదు మీకు. ప్రజ‌లు, ప‌రిశ్రమ మెచ్చి ఇచ్చిన పేరు ఇది. బాపు లాంటి గ్రేట్ డైరెక్టర్ మీ పేరు బ‌దులు ఈ క్యారెక్టర్ నేమ్‌తో పిలిచారంటే అంత‌కంటే గొప్ప అవార్డు ఏముంటుంది!" అని భుజం మీద త‌ట్టి, "గాడ్ బ్లెస్ యూ" అన్నారు." అని చెప్పుకొచ్చారు మ‌ల్లికార్జున‌రావు. ఆ త‌ర్వాత త‌న‌కు 'శ్రీ‌నాథ క‌విసార్వభౌమ‌'లో క్యారెక్టర్ కూడా ఎన్టీఆర్ చెప్పార‌నీ, కానీ త‌న‌కు అదే టైమ్‌లో వంశీ సినిమా 'జోక‌ర్' క్లైమాక్స్ జ‌రుగుతుండ‌టంతో ఆ సినిమా చేయ‌డానికి వీలుప‌డ‌లేద‌నీ మ‌ల్లికార్జున‌రావు చెప్పారు.

మల్లికార్జునరావు 1951 డిసెంబర్ 13న అనకాపల్లి సమీపంలోని కాశిమ్ కోటలో జన్మించారు. బాల్యం నుంచీ నాటకాలు చూడడం, అందులో నచ్చిన పాత్రల్లాగే నటించడం అలవాటు చేసుకున్నారు. దాంతో చదువుకొనే రోజుల్లోనే మిత్రులతో కలసి నాటకాలు వేశారు. రావు గోపాలరావు ఆయనను ప్రోత్సహించారు. రావు గోపాలరావు చిత్రసీమలో తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా జీవితం ఆరంభించారు. ఆ సమయంలోనే ఆయనను కలసిన మల్లికార్జునరావుకు సినిమాల్లో ఎలా నటించాలో మెలకువలు చెబుతూ ఉండేవారు. రావు గోపాలరావు నటుడై మంచి పేరు సంపాదించాక, మల్లికార్జునరావును ఆదరించారు. మల్లికార్జునరావులోని నటునికి దర్శకుడు వంశీ తాను తెరకెక్కించిన “మంచు పల్లకి, సితార, అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, లేడీస్ టైలర్, ఆలాపన” వంటి చిత్రాలలో అవకాశాలు కల్పించారు. ఈ సినిమాలతో నటునిగా మంచి గుర్తింపు సంపాదించారు మల్లికార్జునరావు. ఇతర సినిమాల్లోనూ పాత్రలు లభించాయి. దాంతో మల్లికార్జునరావుకు నటునిగా మరింత గుర్తింపు లభించింది. అయితే వంశీ మాత్రం తాను తెరకెక్కించే ప్రతీ చిత్రంలో మల్లికార్జునరావుకు ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను ఇచ్చేవారు. అలా “లాయర్ సుహాసిని, శ్రీకనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చెట్టుకింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, డిటెక్టివ్ నారద” చిత్రాలలో విలక్షణమైన పాత్రలు ఇచ్చారు వంశీ.

ఎస్వీ కృష్ణారెడ్డి, ఇ.వి.వి. సత్యనారాయణ వంటి హాస్య చిత్రాల దర్శకులు కూడా మల్లికార్జునరావులోని నటునికి తగ్గ వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు. తమ్ముడు సినిమాలోని మల్లికార్జున రావు నటనకు బెస్ట్ కేరెక్టర్ యాక్టర్ గా అవార్డు లభించింది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సైతం తమ చిత్రాలలో మల్లికార్జునరావుకు తగ్గ పాత్రలు ఇచ్చేవారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఛైర్మన్ గానూ మల్లికార్జునరావు సేవలు అందించారు. ‘మా’ కు జనరల్ సెక్రటరీగానూ ఆయన పనిచేశారు. తెలుగు దేశం పార్టీ కల్చరల్ వింగ్ కు సెక్రటరీగానూ ఆయన ఉన్నారు.త‌న కెరీర్‌లో కామెడీ పాత్రల‌తో ప్రేక్షకుల‌ను అమితంగా న‌వ్వించిన ఆయ‌న 'హ‌లో బ్ర‌ద‌ర్‌'లో చేసిన క్యారెక్టర్‌తో ఏడ్పించారు కూడా. బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో పాడుతూ  2008 జూన్ 24న మల్లికార్జున రావు తుదిశ్వాస విడిచారు.భౌతికంగా మల్లికార్జునరావు లేకపోయినా, ఆయన పోషించిన అనేక పాత్రలు ఈ నాటికీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ జనం ఆయనను ‘బట్టల సత్తి’గానే గుర్తుచేసుకుంటూ ఉంటారు.