ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి: ఐదుగురికి గాయాలు

ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి: ఐదుగురికి గాయాలు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : చనిపోయిన వ్యక్తి దహన కార్యక్రమాలకు కట్టెలను తీసుకురావడానికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మరణించగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలైన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం కుప్రియల్ వద్ద 44వ నెంబర్  జాతీయ రహదారి పై చోటు చేసుకుంది.   వివరలు ఇలా ఉన్నాయి. సదాశివనగర్‌ మండల కేంద్రంలో ఓ వ్యక్తి మరణించగా అతని దహన కార్యక్రమాల్ని నిర్వహించేందుకు సదాశివనగర్ మండల కేంద్రము నుండి ట్రాక్టర్లో  ఆరుగురు కలిసి కట్టెలను తీసుకురావడానికి కామారెడ్డి జిల్లా కేంద్రానికి బయలుదేరారు. కుప్రియల్ జాతీయ రహదారిపై ట్రాక్టర్ స్టీరింగ్ ఫెయిల్ కావడంతో ట్రాక్టరు అదుపుతప్పి బోల్తా పడింది.  ట్రాక్టర్లో ఉన్న పోచయ్య (45) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి దేవుని పల్లి పోలీసులు చేరుకున్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులని తరలించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.