ఓటమి ఎరుగని నాయకుడు ఉత్తమ్ 

ఓటమి ఎరుగని నాయకుడు ఉత్తమ్ 
  • భారీ మెజారిటీతో ఉత్తమ్ గెలుపు
  • రాష్ట్ర క్యాబినెట్ లో కీలక పాత్ర పోషించే అవకాశం
  • అంబరాన్నంటిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు

హుజూర్ నగర్ ముద్ర: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో కొత్త ప్రభుత్వాన్ని స్థాపించనుంది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి శానంపూడి సైదిరెడ్డి పై 46 వేల ఓట్ల పైచిలుకు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ స్థాపించబోయే నూతన ప్రభుత్వ మంత్రి వర్గంలో ఉత్తమ్ కు కీలక పదవి రానున్నట్లు పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు సంబరాలు అంబరాన్నంటాయి. కౌంటింగ్ మొదటి రౌండ్ నుండే ఉత్తమ్ స్పష్టమైన మెజారిటీని కనబరిచారు. 18 రౌండ్ ల కౌంటింగ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఒక్క రౌండ్లో కూడా లీడింగ్ లో లేకపోవడం ఆశ్చర్యకరం.

2009 పునర్విభజనలో హుజూర్ నగర్ నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి ఉత్తమ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా నాలుగు సార్లు గెలుపొందడం విశేషం. హుజూర్ నగర్ లో ఓటమి ఎరుగనీ నాయకుడుగా ఉత్తమ్ నిలిచారు. కౌంటింగ్ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎన్నికల అధికారి జగదీశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ గెలుపు పత్రాన్ని అందజేశారు. ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి కూడా కోదాడలో ఎమ్మెల్యేగా గెలుపొందడం కొసమెరుపు.

ప్రధాన పార్టీ అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్య...

ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ( 1,16,707)
శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్( 71,819)
పిల్లుట్ల రఘు ఏఐఎఫ్ బి ( 8280)
చల్ల శ్రీలత రెడ్డి బిజెపి ( 3715)
మల్లు లక్ష్మి సిపిఎం ( 1914)
రాపోల్ నవీన్ కుమార్ బీఎస్పీ (1481)