ఇంకెప్పుడు తరలిస్తారు

ఇంకెప్పుడు తరలిస్తారు

ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన

కేసముద్రం, ముద్ర: ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి నెలరోజులు కావస్తున్న కాంట పెట్టి మిల్లుకు తరలించక ఇబ్బందులు పెట్టడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నరసింహుల గూడెం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై సోమవారం రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి నిరసనకు దిగారు. కొనుగోలు కేంద్రాలకు దాన్యం తెచ్చి నెల రోజులైన ధాన్యం తరలింపులో అలసత్వం వహిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతులు పెద్ద ఎత్తున చేరుకొని మహబూబాబాద్ నెల్లికుదురు ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలు, గడ్డి వేసి తగలబెట్టారు. రైతుల నిరసనతో ఈ మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ధాన్యం తెచ్చి రోజుల తరబడి నిరీక్షిస్తున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అటు వాతావరణం లో మార్పులు వచ్చిపోయే వానలతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలిన్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. పేరుకుపోయిన ధాన్యానికి తక్షణం కాంటాలు పెట్టి లారీల్లో మిల్లుకు తరలించాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న నెల్లికుదురు ఎస్సై క్రాంతి కిరణ్ ఘటన స్థలానికి చేరుకొని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.