నిబంధనలకు నీళ్లు

నిబంధనలకు నీళ్లు
  • తుతూ మాత్రంగా తనిఖీలు
  • ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు

ముద్ర,షాద్ నగర్:-ఇక్కడ వాళ్లు చెప్పిందే వేదం. పరిసరాలు కాలుష్యమయమై ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా... తమ పరిశ్రమలో విధులను నిర్వహిస్తున్న కార్మికులకు సైతం సరైన రక్షణ పరికరాలను కల్పించకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమల యజమాన్యాలు నిబంధనలకు నీళ్లు వదిలి  యదేచ్చగా సంఘటనకు ఓ రేటు కట్టి తమకు ఎదురే లేదంటూ ప్రవర్తిస్తున్నాయి.  తమ పరిశ్రమలలో విధులను నిర్వహిస్తున్న కార్మికులకు ఎలాంటి కార్మిక చట్టాలను వర్తింప చేయకుండా, రక్షణ పరికరాలను ఇవ్వకుండా  వారితో పని కానిచ్చేస్తున్నారు. పరిశ్రమలో ఏదైనా ప్రమాదం జరిగితే కార్మిక బీమాలు వర్తింపజేయకుండా  కాలుకో రేటు, చేతికో రేటు , ప్రాణానికి ఓ రేటు అంటూ  మధ్యవర్తులతో  సెటిల్మెంట్ లతో పరిశ్రమలలో జరిగే ప్రమాదాలను బయటికి రానివ్వడం లేదు.  ఇదంతా షాద్ నగర్ నియోజకవర్గం లోని పారిశ్రామిక వాడలో ప్రతినిత్యం జరిగేదే. ఇదిలా ఉంటే కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేయించాల్సిన కార్మిక శాఖ  అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో పరిశ్రమల యజమాన్యాలదే ఆడిందే ఆట , పాడిందే పాట అన్న చందంగా తయారైంది.

షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరక్ నగర్, కొందుర్గు  మండలాలలో వివిధ పరిశ్రమలు పెద్ద ఎత్తున వెలిసాయి. ఉపాధి నిమిత్తం  నియోజకవర్గం లోని కార్మికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి  పొట్ట చేత పట్టుకొని  బతుకు తెరువు కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. పరిశ్రమలలో విధులను నిర్వహిస్తున్న కార్మికులకు ఎలాంటి రక్షణ పరికరాలనుఇవ్వకుండా, కార్మిక చట్టాలను తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా పరిశ్రమల యజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. నియోజకవర్గంలో  ఏదో ఓ పరిశ్రమలో  ప్రతినిత్యం కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నా బయటకు వచ్చే ఇవి కొన్ని సంఘటనలే. తాజాగా కొందుర్గు  మండల కేంద్రంలోని స్కాన్ ఎనర్జీ ప్రైవేట్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి అక్కడ విధులను నిర్వహిస్తున్న కార్మికులపై వేడి ద్రవం పడి తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమ యజమాన్యం కార్మికులకు సరైన రక్షణ పరికరాలను ఇవ్వకపోవడం వల్లే విధులను నిర్వహిస్తున్న వారు  తీవ్రంగా గాయపడ్డారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన చికిత్స నిమిత్తం షాద్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా కార్మిక శాఖ అధికారులు స్పందించి  షాద్ నగర్ నియోజకవర్గంలోని పరిశ్రమలలో విధులను నిర్వహిస్తున్న కార్మికులకు రక్షణతో పాటు వారికి భరోసాను కల్పించాల్సిన అవసరం ఉంది.