చేనేత పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి కేటీఆర్ 

చేనేత పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి కేటీఆర్ 
  • పోచంపల్లి లో నేతన్న విగ్రహం ఆవిష్కరణ
  • చేనేతకు చేయూతనిచ్చి ఆదుకుంటాం

భూదాన్ పోచంపల్లి, ముద్ర:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించాయని, చేనేత కార్మికుల ఆకలి చావులకు చెలించన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోచంపల్లిలో జోలి పట్టి చేనేత కార్మికులకు భరోసా కల్పించామన్నారు.

చేనేతకు యారన్ పై సబ్సిడీని అందించామని, చేనేత కార్మికుల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని తెలిపారు. రైతు బీమా మాదిరిగా చేనేత బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత గుర్తింపు కార్డులను తీసుకోవాలని, జియో టాగ్ కలిగిన ప్రతి చేనేత కార్మికుడు హెల్త్ కార్డును పొందాలన్నారు. చేనేత కార్మికులకు రంగులు రసాయనయాలకు ప్రతినెల 3000 రూపాయల చొప్పున తమ అకౌంట్ లలో జమ చేస్తామని పేర్కొన్నారు. 59 సంవత్సరాలు వరకే కాకుండా 75 సంవత్సరాల వరకు ఎల్ఐసి ద్వారా బీమా అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుడు మృతిచెందితే అంతక్రియలకు గాను 5000 నుండి 25 వేల వరకు పెంచుతున్నట్లు తెలిపారు. 

అదేవిధంగా మండల పరిధిలోని కనుముక్కల గ్రామంలో మూతబడిన పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును ప్రభుత్వం ద్వారా 12.5 కోట్లకు కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కలిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగం పట్ల చిన్నచూపు చూస్తుందని, చేనేత కార్మికుల పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ కార్మికుల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిచ్చి ఆదుకుంటుందని, మాది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని అన్నారు. చేనేత భవనం కోసం కోకాపేటలో రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోచంపల్లి లో అనేక అభివృద్ది పనులు,  సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశామన్నారు.

 పోచంపల్లి అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,  బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ ఎల్ రమణ ,కంచర్ల రామకృష్ణారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి,

మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, సర్పంచుల ఫారం మండల అధ్యక్షుడు సామ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫారం మండల అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం గౌడ్, నాయకులు దొడ్డమోని చంద్రం యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.