యాసంగి పంటలు వర్షార్పణం..!

యాసంగి పంటలు వర్షార్పణం..!

కేసముద్రం, ముద్ర: మంగళవారం రాత్రి కురిసిన గాలివానకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల్లో యాసంగిలో సాగుచేసిన మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చే దశలో వరి పొలాలు చాలా చోట్ల నేల వాడడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. అకాల వర్షానికి కోత కోసి నూర్పిడి చేసిన వరి మక్కజొన్న ఉత్పత్తులు తడిసి ముద్దయ్యాయి. ఆయా మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో విక్రయానికి తెచ్చిన మక్కజొన్నలు, ధాన్యం వర్షానికి తడిసిపోయి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. తెల్లవారితే విక్రయించి డబ్బులు పొందుతామని ఆశతో ఉన్న రైతులకు చెడగొట్టు వాన చెడు చేసిందని రోదిస్తున్నారు. బుధవారం ఉదయం తడిసిన మక్కజొన్నలు, ధాన్యాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆరబెట్టుకునే దృశ్యాలు కనిపించాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొంతమేర నష్టపోగా, మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఇంకొంత నష్టం జరిగిందని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొంటున్నారు.