మేడారం వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి

మేడారం వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి
  • కారును టిప్పర్​ఢీకొనడంతో నలుగురు మృతి
  • మరో ఇద్దరి పరిస్థితి విషమం
  • పత్తిపాక క్రాస్ రోడ్ వద్ద ఘోర ప్రమాదం
  • నుజ్జునుజ్జయిన కారు

ముద్ర ప్రతినిధి, వరంగల్: రోడ్డుపై రక్తపుటేరులు పారాయి. వనదేవతలను దర్శనం చేసుకుని వస్తుండగా టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. పత్తిపాక క్రాస్ రోడ్ వద్ద కారును టిప్పర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పత్తిపాక క్రాస్ రోడ్ వద్ద జరిగింది. ఆత్మకూరు సీఐ బండి కుమార్ కథనం మేరకు.. వరంగల్ కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన వెల్దండి సాంబరాజు, అనుముల నరసింహస్వామి కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం సమ్మక్క, సారలక్కల దర్శనానికి వెళ్లారు. వనదేవతలకు మొక్కులు చెల్లించి సాయంత్రం తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో పత్తిపాక క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగా.. టిప్పర్ బలంగా కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అనుముల నరసింహస్వామి(50), వెల్దండి సాంబరాజు(42), వెల్దండి ఆకాంక్ష(26), లక్ష్మీ ప్రసన్న(6) అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ అనుముల రాజశ్రీ(50), అనుముల అక్షిత(20)ను పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీరితోపాటు కారులో అక్షయ రాజు, ఆకర్ష్ ఉన్నారు.  మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన చోటు భయంకరంగా మారింది. టిప్పర్ గుద్దడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. కారులో చనిపోయినవారు ఒకరిపై మరొకరు పడిఉన్నారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలికి చేరుకొని భోరున విలపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కుమార్​తెలిపారు.