జర్నలిస్టు ఉద్యమ నేత అంబటి కన్నుమూత

 జర్నలిస్టు ఉద్యమ నేత అంబటి కన్నుమూత

విజయవాడ: జర్నలిస్టు ఉద్యమ నేత, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) సలహాదారు అంబటి ఆంజనేయులు(78) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం గుండెనొప్పి రావడంతో విజయవాడలోని ఒక ఆసుపత్రిలో చేరిన అంబటి చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికలో మూడు దశాబ్దాలకుపైగా పనిచేసిన ఆంజనేయులు.. మొదటి నుంచి జర్నలిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఐజేయూ ఉపాధ్యక్షుడిగా, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడుగా, ప్రధాన కార్యదర్శిగా, ఏపీ ఎన్ ఈ ఎఫ్ అధ్యక్షుడిగా ఆయన విశేషమైన సేవలు అందించారు. ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్లాంట్ లెవెల్ యూనియన్ లో ఆయన సుదీర్ఘకాలం కీలక బాధ్యతలు నిర్వహించారు. మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా ట్రస్టీగా కూడా ఆయన సేవలందించారు. అంబటి ఆంజనేయులు మృతి పట్ల ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి,  ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన జర్నలిస్టు ఉద్యమానికి అందించిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకుని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపినవారిలో ఐజేయూ సెక్రటరీ జనరల్​బల్విందర్​సింగ్​జమ్మూ, కార్యదర్శులు డి. సోమసుందర్, వై. నరేందర్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్.ఎన్​సిన్హా. ఎం.ఎ. మాజిద్, కార్యవర్గ సభ్యుడు కే సత్యనారాయణ, ఆలపాటి సురేశ్​కుమార్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, యూనియన్ సీనియర్ నాయకులు డి.కృష్ణారెడ్డి, నల్లి ధర్మారావు, కె. రాంనారాయణ, ఉన్నారు.