ఢిల్లీ అలర్ట్

ఢిల్లీ అలర్ట్
  • నేడు హైకమాండ్ తో టి–నేతల కీలక భేటీ
  • వెంటనే ఢిల్లీకి రావాలని 25 మందికి పిలుపు
  • పొంగులేటి, జూపల్లి చేరిక తేదీ ఖరారు!
  • అసంతృప్త నేతల మాట్లాడనున్న పెద్దలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :టి–కాంగ్రెస్​నేతలు ఢిల్లీ బాటపట్టారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్​రావ్​ఠాక్రే, టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి, సీనియర్లు వి.హనుమంతరావు, ఉత్తమ్​కుమార్​రెడ్డి, జానారెడ్డితో పాటు 25 మంది నేతలకు అధిష్టానం నుంచి పిలుపు అందింది. వీరందరూ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే కీలక భేటీలో పాల్గొంటారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరిక అంశాలు చర్చకు రానున్నాయి. దీంతో పాటు కొంతకాలంగా సీనియర్ల మద్య నెలకొన్న అసంతృప్తి పైనా ఇప్పటికే ఆరా తీసిన అధిష్టానం అందుకు దారితీసిన కారణాలు, పార్టీలో నేతల చేరికలతో తలెత్తె పరిణామాలపైనా చర్చించనుంది. ప్రధానంగా పొంగులేటి చేరిక విషయంలో అసంతృప్తితో ఉన్న ఉత్తమ్​కుమార్​రెడ్డి, రేణుక చౌదరి ఈ భేటీలో పాల్గొంటారా? లేదా? అనే ఆసక్తి నెలకొంది. ముందు నుంచీ పొంగులేటి చేరికను వ్యతిరేకిస్తున్నప్పటికీ, అధిష్టానం వారిని పిలిపించుకోవడం అసంతృప్త నేతలకు మింగుడుపడడం లేదు. టిక్కెట్ల ఒప్పందంతో కాంగ్రెస్​లో చేరుతున్నట్లు వస్తోన్న ఆరోపణలను ఇప్పటికే పొంగులేటి ఖండించినా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన అనుచరులు మాత్రం టిక్కెట్లు వస్తాయనే పూర్తి ధీమాతో ఉన్నారు. మరోవైపు ఖమ్మంలో పొంగులేటీ ఆయన ముఖ్య అనుచరులు డీసీసీబీ మాజీ చైర్మన్​మువ్వ విజయ్, తూళ్లూరు బ్రహ్మయ్యపై పోలీసు కేసులు నమోదు కావడం చర్చకు దారితీసింది. ఇదంతా కేసీఆరే చేయిస్తున్నారంటూ పొంగులేటి వర్గీయులు చెబుతున్నారు. 

ఢిల్లీలోనే ఈటల, రాజగోపాల్​రెడ్డి!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో శనివారం భేటీ ముగిసినా ఆ పార్టీ అసంతృప్త నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఢిల్లీలోనే మకాం వేయడం ఆసక్తి రేపుతోంది. ఆదివారం నాగర్ కర్నూల్​లో నడ్డా పాల్లొన్న బీజేపీ బహిరంగ సభను కాదని ఇరువురు నేతలు హస్తీనాలో ఉండడం కమలనాథులలో ఆందోళనకు గురి చేస్తోంది. నడ్డాతో జరిగిన భేటీ పూర్తయినా ఇరువురు నేతలు అధిష్టానం తీరుపై ఇంకా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో నేడు ఢిల్లీలో టి– కాంగ్రెస్​నేతలతో రాహుల్ గాంధీ​భేటీలో ఈటల, రాజగోపాల్​రెడ్డి కూడా పాల్గొంటారనే చర్చ హాట్​టాపిక్​గా మారింది. ఇప్పటికే ఠాక్రే బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్​అధిష్టానంతో టచ్​లో ఉన్నారని ప్రకటించిన విషయం తెలిసిందే.