చట్టసభల్లో బీసీలకు మద్దతు ఇచ్చే వారికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు - డాక్టర్ అరుణ్ కుమార్

చట్టసభల్లో బీసీలకు మద్దతు ఇచ్చే వారికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు - డాక్టర్ అరుణ్ కుమార్

ము ద్ర ప్రతినిధి, వికారాబాద్: చట్టసభల్లో బీసీలకు మద్దతు ఇచ్చే వారికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూర్ లోని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్వగృహంలో శనివారం నిర్వహించిన  సమావేశంలో బీసీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రాష్ట్రంలోనే ఎవరు చేపట్టని విధంగా రూ. రెండు కోట్లతో రెండు ఎకరాల్లో బీసీ సంక్షేమ భవనం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు నిర్వహించేందుకు చూపిన శ్రద్ధ తమను ఆకర్షించిందన్నారు. అలాగే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచే విషయంలో తమకు మద్దతు ఇస్తామని తెలపడం వల్లే తాండూర్ లో రోహిత్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా సోషలిస్టు భావజాలం కలిగి, బిసి లకు మద్దతుగా నిలబడే వారికి ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇస్తుందన్నారు.
తాండూరుకు విచ్చేసిన రాజ్యసభసభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య గారి కుమారుడు డాక్టర్. అరుణ్ కుమార్ ను  తాండూరు బీసీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీశైలం రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజ్ కుమార్, సయ్యద్ శుకుర్ తదితులున్నారు.