సబ్ కా మాలిక్ ఏక్ హై

సబ్ కా మాలిక్ ఏక్ హై
Sub Ka Malik Ek Hai Chand Pasha

వికారాబాద్,ముద్ర: సబ్ కా మాలిక్ ఏక్ హై అని చాటి చెప్పేలా ఓ ముస్లిం సోదరుడు ప్రతిఏటా శివ స్వామి, అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తూ స్వామి వారికి తానే స్వయంగా నైవేద్యాన్ని సమర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండల పరిధిలోని ఇంధోల్ గ్రామానికి చెందిన ముస్లిం సోదరుడు చాంద్ పాషా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకున్న దాంట్లోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

అందులో భాగంగానే సోమవారం గ్రామంలోని లింగమయ్య స్వామి దేవస్థానం వద్ద అతనీ ఆధ్వర్యంలో శివ మాల ధరించిన భక్తులచే పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి, స్వామివారికి ప్రత్యేక నైవేద్యాన్ని తానే స్వయంగా సమర్పించారు. అనంతరం పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి శివ భక్తులకు,గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శాలువాతో చాంద్ పాషా ను సన్మానించి అభినందించారు   మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పేలా చాంద్ పాషా చేస్తున్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని కుల,మత బేధాలు లేకుండా కలిసి మెలిసి జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ భక్తులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, పాత్రికేయ మిత్రులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.