హామీల ఎగవేత బడ్జెట్: బీజే ఎల్ పి నేత మహేశ్వర్ రెడ్డి

హామీల ఎగవేత బడ్జెట్: బీజే ఎల్ పి నేత మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క  బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉన్నది  తప్ప ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా కనిపించడం లేదని, వాస్తవాలకు దూరంగా ఉందని బిజెఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన 'ముద్ర ప్రతినిధి' తో మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశ పరిచిందన్నారు. రైతులు, నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపిందన్నారు. వ్యవసాయ రంగానికి కేవలం 19, 746 కోట్ల మాత్రమే కేటాయించారని,రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత కరెంట్, పంటల బీమా, పంటలకు బోనస్ అన్నింటికి ఈ నిధులు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు.

గత ప్రభుత్వ వైఫల్యాలను చెప్పే ప్రయత్నంపైనే ఫోకస్ చేశారు తప్ప అభివృద్ధి, నిధుల కేటాయింపుపై దృష్టిపెట్టలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మూడో వంతు నిధులు కూడా ఇవ్వలేదన్నారు. ఇది ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా, పీఎం మిత్ర లాంటి పథకాలను బడ్జెట్ లో ప్రస్తావించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గులాబి సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించిన కాంగ్రెస్, ఇప్పుడు మళ్లీ అవే తప్పులను చేస్తోందన్నారు.