అభివృద్ధి మంత్రం.. గ్యారంటీ తంత్రం జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

అభివృద్ధి మంత్రం.. గ్యారంటీ తంత్రం జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: పోలింగ్ తేదీకి మరో 33 రోజుల వ్యవధి ఉండగా అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేశాయి. గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రచార అస్త్రంగా టిఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి వెళుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో ప్రకటించిన ఆరోగ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళుతున్న ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

" టిఆర్ఎస్ ది అభివృద్ధి మంత్రం"
   అధికారం టిఆర్ఎస్ పార్టీ గడిచిన తొమ్మిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, డబుల్ బెడ్ ఇండ్లు మొదలైన పథకాలతో పాటు కాలేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం, మెడికల్ కాలేజీలో ఏర్పాట్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణం, మోడల్ స్కూల్, కస్తూరిబాలు, మైనారిటీ గురుకులం, బిసి, ఎస్టి గురుకుల పాఠశాలల ఏర్పాటు, రైతు వేదికలు, కొత్త మండలాలు, కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, ఫైర్ స్టేషన్, జాతీయ రహదారి విస్తరణ మొదలైన అభివృద్ధి పథకాలను బూత్ కమిటీల ద్వారా గడపగడపకు ప్రచారం చేస్తున్నారు.

" కాంగ్రెస్ 6 గ్యారెంటీల తంత్రం"
   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇస్తూ ఇంటింట ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలని సామాన్యుడికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మహాలక్ష్మి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రైతు భరోసా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని సామాన్యుడికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు.
   .