తొర్రూర్ లో నకిలీబాబాకు దేహశుద్ధి

తొర్రూర్ లో నకిలీబాబాకు దేహశుద్ధి
  •  నగ్నవీడియోలు ఉన్నాయని మహిళకు వేధింపులు.. 
  •  మహిళా సంఘాలను ఆశ్రయించిన బాధితురాలు
  •  చితకొట్టి పోలీసులకు అప్పగించిన మహిళలు

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఓ నకిలీబాబా బండారం శనివారం బట్టబయలైంది. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బస్ స్టేషన్ సమీపంలో ఓ..కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని బాబాగా ప్రచారం చేసుకుంటూ ప్రధానంగా మహిళలనే లక్ష్యంగా ఎంచుకొని వ్యవహారం నడుపుతున్న నకిలీ బాబా గుట్టురట్టైంది. హైదరాబాద్ కు చెందిన శ్రీదేవి అనే మహిళ అనారోగ్యంతో ఉండడం, కుటుంబపరమైన చికాకులు ఉండడంతో ఈ..నకిలీబాబాను ఆశ్రయించింది. ఆమెను మాయమాటలతో తనదారిలోకి తెచ్చుకొని, వైద్యం పేరుతో  లొంగదీసుకున్నాడు. సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఈ నకిలీబాబా ఆమె వద్ద నుండి వసూలు చేసాడు. అంతేకాకుండా తన వద్ద నీకు సంబంధించిన నగ్నవీడియోలు ఉన్నాయని, బ్లాక్ మెయిల్ చేస్తూ మరిన్ని డబ్బుల కోసం వేధించడం ప్రారంబించాడు. దీంతో దిక్కుతోచని ఆ మహిళ హైదరాబాదులో మహిళాసంఘాలను ఆశ్రయించింది. హైదరాబాదుకు చెందిన మహిళా సంఘం బాద్యులు బాదిత మహిళకు అండగా తొర్రూర్ వచ్చారు.

మహిళను వేదిస్తున్న నకిలీబాబాను నిలదీశారు. అంతటితో ఆగకుండా  ఆ నకిలీబాబాకు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ కు ఈడ్చుక వచ్చారు. తొర్రూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పెద్దవంగరకు చెందిన యాకయ్య అనే వ్యక్తి బాబాగా మారి తొర్రూర్ లో కుటీరం ఏర్పాటు చేసుకొని తనను తానే బాబాగా ప్రచారం చేసుకున్నాడు. అన్ని రకాల వ్యాధులను నయం చేస్తానని, చీడపీడల నుండి మంత్రశక్తులతో విముక్తి కల్పిస్తానని ప్రచారం చేసుకున్నాడు.  అతని మాయమాటలు నమ్మిన హైదరాబాదుకు చెందిన శ్రీదేవి అనే మహిళ అతని వలలో పడింది. తన అనారోగ్య సమస్యలను, కుటుంబ పరిస్థితులను చక్కదిద్దాలని కోరుతూ నకిలీబాబాను ఆశ్రయించింది. అదే అదునుగా నకిలీబాబా ఆమెనుండి సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బులు కాజేశాడు. తాయతలు కట్టి, బాగు చేస్తానని చెప్పి కొన్ని రకాల మందులు ఇచ్చి ఆమెను లోబరుచుకున్నాడని మహిళాసంఘం బాద్యులు చెబుతున్నారు. నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడని, దీంతో ఏం చేయాలో తోచక బాదితురాలు తమను ఆశ్రయించిందని తెలిపారు. తమ వద్ద మోసానికి సంబంధించిన అన్నిరకాల ఆధారాలు ఉన్నాయని, వాటిని పోలీసులకు సమర్పిస్తామని తెలిపారు.    బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న తొర్రూర్ పోలీసులు.. బాబాగా మారిన యాకయ్య  గత చరిత్ర గురించి ఆరాతీస్తున్నారు. ఇంకా ఎంత మందిని ఈ విధంగా మోసం చేశాడనే అంశం పైన విచారణ ప్రారంభించారు.