అసత్య ప్రచారాలు..! అడ్డగోలుగా బెదిరింపులు..!!

అసత్య ప్రచారాలు..! అడ్డగోలుగా బెదిరింపులు..!!
  • ఈడి ని అడ్డుపెట్టుకొని మోడీ పాలన.. 
  • లిక్కర్ కుంభకోణంలోకి కవితను లాగాలని చూడడం బిజేపి చౌకబారు రాజకీయం.. 
  • తాటాకు చప్పుల్లకు కేసీఆర్ భయపడరు.. తాడోపేడో మీతోనే తేల్చుకుంటాం.. 
  • దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుంది.. మోడీకి వణుకు పుడుతోంది.. 
  • రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖలమంత్రి సత్యవతిరాథోడ్ 

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: అసత్యాలు ప్రచారం చేయడం, అడ్డగోలుగా బెదిరించడమే బీజేపీ నేతల నైజమని, ఎక్కడో మీ..ఆటలు సాగవచ్చుగాని, తెలంగాణలో సాగవని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలమంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బిజేపి పైన, కేంద్రప్రభుత్వం తీరుపైన నిప్పులు చెరిగారు. తరుణ్ చుగ్ ఉమ్మడివరంగల్ జిల్లాలో పర్యటిస్తూ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు, మోడీ అధాని దేశాన్ని దోచుకుంటున్నరని, దొంగే దొంగ దొంగ అన్నట్లు తరుణ్ చుగ్ మాట్లాడుతున్నాడని విమర్శించారు.మహబూబాబాద్ గిరిజనుల పార్లమెంట్ అని, ఇక్కడికి  వచ్చి మాట్లాడే నైతిక హక్కు బిజెపి నాయకులకు లేదన్నారు. విభజన చట్టం హామీలు అమలు చేయకుండా ఇక్కడికి వచ్చి అబద్ధాలు మాట్లాడితే నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరని తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇలా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.

రాజకీయ విమర్శలు చేయడం తప్ప, మీరు ఈ రాష్టానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని బిజేపి నాయకులను మంత్రి సత్యవతిరాథోడ్ ప్రశ్నించారు. లిక్కర్ కుంభ కోణంలో ఒక మహిళను లాగాలని చూడటం దారుణమన్నారు. విచారణ కాకముందే అరెస్ట్ అవుతుంది అని బిజెపి నాయకులు అంటున్నారు అంటే, విచారణ సంస్థలు బిజెపి జేబు సంస్థలే కదా అని ప్రశ్నించారు. కర్నాటక, మధ్యప్రదేశ్, గోవా ఇలా దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో దొడ్డిదారిన అధికారంలోకి  బిజెపి వచ్చిందని, కానీ తెలంగాణాలో కేసీఆర్ ఉండగా మీ..ఆటలు సాగవన్నారు. అధానీ కోసం  దేశాన్ని ప్రదాని మోడీతాకట్టు పెడుతున్నారు, బీజేపీ అంటేనే జూటా పార్టీగా మారిపోయిందన్నారు.  అధికారం తప్ప, దేశంపైన కానీ, ప్రజల పట్ల కానీ కనీస బాధ్యత బీజేపీకి లేదని విమర్శించారు.

రాజ్యాంగ బద్ద పదవుల్లో బీజేపీ ఏజెంట్లను నియమించుకొని, రాజ్యాంగ విలువల్ని మంటగలుపుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ప్రజలు ప్రతిఅంశాన్ని గమనిస్తున్నారని తెలిపారు. మోడీ అంటే ఈడి, ఈడి అంటే మోడీగా మారిందని ఎద్దేవా చేసారు. బిజెపి పార్టీ ఏమైనా రామేశ్వరమా, కాశీనా అందులో చేరగానే చేసిన తప్పులు మాయమవడానికని, బిజెపి పార్టీలో చేరితే కేసులు గురించి ప్రశ్నించారా అని సత్యవతిరాథోడ్ ప్రశ్నించారు. బిజెపి బెదిరింపులకు, తాటాకు చప్పుల్లకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని ,స్పష్టం చేసారు. కేంద్రం బిజెపి పాలనలో మోదీ రాష్ట్రాలను సమానంగా చూడడం లేదని, రాష్ట్రాలకు సమానంగా నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల లోని ప్రభుత్వాల పైన మాత్రం ఈడి నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. మహిళలను అసభ్య పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు గౌరవమని ప్రశ్నించారు. మా బారాస సైన్యం బయటకు వస్తే మీరు ఒక్క కార్నర్ మీటింగ్ జరుపలేరని హెచ్చరించారు.

మహిళలను అవమానపరచడం, అధికారులను అవహేళన చేయడం మీ సిద్దాంతమా అని సూటిగా నిలదీశారు. దేశంలో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయనే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మారిందని, యావత్తు దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు. దీంతో మోడీకి దడపుడుతుందని,  కేసీఆర్ ను నిలువరించాలని కుప్పిగంతులు వెస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నాయకులు కేసీఆర్ ని ఆహ్వానిస్తున్నారని, దీనిని మీరు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. తొమ్మిది ఏళ్లుగా మీ ప్రభుత్వం ద్వారా దేశంలో రైతులకు, పేదలకు చేసిన ఒక్క పని చెప్పండి,బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము వంద చెబుతామని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మరోసారి ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం కర్రు కాల్చి వాత పెడతామని బిజెపి నాయకులను మంత్రి సత్యవతిరాథోడ్ ఘాటుగా హెచ్చరించారు.