టీఎస్ఆర్టీసీ టీ9 టిక్కెట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్

టీఎస్ఆర్టీసీ టీ9 టిక్కెట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
  • గ్రామీణ ప్రయాణికులకు టీ-9 టికెట్‌ అమలు
  • మహిళలు, వయోవృద్ధులకు అవకాశం
  • రూ.100 చెల్లిస్తే 60 కి.మీలు పోయిరావచ్చు
  • రానుపోను రూ.20ల నుంచి రూ.40ల వరకు ఆదా
  • ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలి డిపో మేనేజర్ ధరమ్ సింగ్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా:టీఎస్ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టీ9 టిక్కెట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు 'టి-9 టికెట్‌' తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన టీ9 టిక్కెట్ ప్రయాణ సమయాన్ని పెంచింది..ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్‌ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుందని, నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ ధరమ్ సింగ్ తెలిపారు.

టీ9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్‌ఆర్టీసీ కల్పించిందన్నారు. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబీ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్‌ వర్తిస్తుందన్నారు.టీ9 టికెట్‌ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్‌ ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయన్నారు.పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం టి-9 టికెట్‌ను ప్రవేశపెట్టిందని,ఈ టికెట్‌తో రూ.100 చెల్లించి 60 కి.మీ పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయవచ్చునని, మంగళవారం ఉదయం 9 గంటలకు నాగర్ కర్నూలు డిపోకు చెందిన TS 31 T 0555 కండక్టర్ వి ఎస్ గౌడ్ 152698 సర్వీస్ నెంబర్ కండక్టర్ మహబూబ్ నగర్ నుండి నాగర్ కర్నూల్ కు ప్రయాణించే మహిళ, 58 పైబడిన ఉద్యోగులకు టి9 టికెట్ గురించి వివరించి వంద రూపాయల టికెట్ ను అందజేశారు. 100 రూపాయలతో వీరి నాగర్ కర్నూల్ నూతన కలెక్టరేట్ వరకు, కలెక్టరేట్ నుండి మళ్లీ మహబూబ్నగర్ వరకు ప్రయాణించవచ్చు.

ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ బస్సులో 10 మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారని కండక్టర్ వి ఎస్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా చారవాణిలో ప్రయాణికులతో మాట్లాడిన నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ ధరమ్ సింగ్ ప్రయాణికుల స్పందనను తెలుసుకున్నారు.ఉదయం 9 గంటలకు మహబూబ్నగర్ బస్టాండు నుండి నేరుగా నాగర్కర్నూల్ నూతన కలెక్టరేట్ వరకు టి 9 టికెట్ పై ప్రయాణించేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.మహిళ మరియు 58 పైబడిన ఉద్యోగస్తులకు ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.