రసవత్తరంగా మంథని అసెంబ్లీ పోరు

రసవత్తరంగా మంథని అసెంబ్లీ పోరు
  • సై అంటే సై అంటున్న కాంగ్రెస్, బిఆర్ఎస్
  • బీఎస్పీ అభ్యర్థిగా రంగంలో 'చల్ల'
  • తెల్ల కాగితంలా సునీల్ రెడ్డి
  • మారుతున్న సమీకరణలు

మహాదేవపూర్, ముద్ర: కాలం మారింది. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ఆర్థిక రాజకీయ సమీకరణాలతో మంథనిలో పలువురు అభ్యర్థులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ కంచుకోట మంథని అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారనుంది. స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు 1999లో నక్సల్స్ చేతిలో హతమైన విషాద పరిస్థితిలో2000లో ఆయన కుమారుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు రంగ ప్రవేశం చేశారు. ఆప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ గా, కాంగ్రెస్ పార్టీ విప్పుగా, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నత పదవులను అలంకరించారు. కరీంనగర్ జిల్లాను శాసించిన శ్రీధర్ బాబు మంథనిలో ఎదురులేని నాయకుడిగా జెండా పాతారు.

తన వద్ద మంథని జడ్పిటిసీగా ఉన్న పుట్ట మధుకర్ ను శ్రీధర్ బాబు దూరం పెట్టడంతో తిరుగుబాటు ప్రకటించి 2014లో టిఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీధర్ బాబు పై పోటీ చేసి గెలుపొందారు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న పుట్ట మధు మంథనిలో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు పెద్దపెల్లి జడ్పీ చైర్మన్గా ఎన్నికై అనేకమంది అనుచరులను కూడగట్టుకుని తనదైన సేవా కార్యక్రమాలతో మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబుకు సమవుజ్జిగా మారాడు. 2018లో శ్రీధర్ బాబు పై పోటీ చేసి పుట్ట మధు ఓడిపోయారు. అతి విశ్వాసంతోపుట్ట మధు ఓటర్లకు డబ్బులు పంచకపోవడం రాజకీయ తప్పిదమని పలువురు నేటికీ భావిస్తారు.  అనంతరం పెద్దపల్లి జెడ్పి చైర్మన్గా గెలుపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పుట్ట మధు తిరిగి శ్రీధర్ బాబు పై పోటీకి నిలబడ్డారు. వీరిద్దరి పోరు యుద్ధాన్ని తలపిస్తుందని విశ్లేషిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలో 2010 నుండి పనిచేస్తూ చంద్రుపట్ల సునీల్ రెడ్డి టికెట్ ఆశించిన సమయంలో 2014 లో టిఆర్ఎస్ టికెట్ పుట్ట మధును వరించడంతో ఆయన బిజెపి పార్టీలోకీ మారారు. శ్రీపాదరావుపై గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామ్ రెడ్డి తనయుడిగా సునీల్ రెడ్డికి గుర్తింపు ఉంది.

ప్రస్తుతం బిజెపి అభ్యర్థిగా సునీల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పుట్ట మధుకు పోటీగా బిఆర్ఎస్ టికెట్ ఆశించిన చల్ల నారాయణరెడ్డి అధిష్టానం వద్ద అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో, మరో ప్రయత్నంగా టికెట్ ఇస్తారన్న ధీమాతో బిజెపి పార్టీలో చేరారు. తీరా చంద్రుపట్ల సునీల్ రెడ్డికి బిజెపి అధిష్టానం టికెట్ కేటాయించడంతో చల్ల నారాయణరెడ్డి సందిగ్ధంలో పడిపోయారు. మంథని నియోజకవర్గంలో తన సత్తా చూపాలని భావిస్తున్న చల్ల నారాయణరెడ్డి బిఎస్పి టికెట్ ను అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చల్ల నారాయణరెడ్డి కూడా శ్రీధర్ బాబుతో ఉన్న విభేదాల కారణంగానే బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పుట్ట మధుకర్ కు సునీల్ రెడ్డికి మంథని పరిసర మండలాలో గట్టిపట్టుండగా, శ్రీధర్ బాబుకు చల్ల నారాయణరెడ్డి కి కాటారం చుట్టూ ఉన్న ఐదు మండలాల్లో గట్టిపట్టు ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకు పుట్ట మధుకు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న తరుణంలో బిజెపి అభ్యర్థి సునీల్ రెడ్డి పోటీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో లబ్ధి చేకూరుతుందని పలువురు విశ్లేషించుకుంటున్న తరుణంలో బీఎస్పీ అభ్యర్థిగా చల్ల నారాయణరెడ్డి రంగంలోకి దిగటంతో రాజకీయం రసకందాయములో పడింది. శ్రీధర్ బాబు, చల్ల నారాయణరెడ్డిలు ఇద్దరూ ఒకే ఊరు, ఒకే మండలానికి సంబంధించిన వారైనందున చల్ల నారాయణరెడ్డి రంగప్రవేశంతో శ్రీధర్ బాబుకు నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీధర్ బాబుకు ప్రధాన అనుచరుడిగా ఉండిన చల్ల నారాయణరెడ్డి రాజకీయ ఎత్తుగడలు పన్నడంలో చాలా దిట్టగా పేరున్నది. మొత్తం మీద ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తేల్చుకోలేని ఉత్కంఠ భరితంగా మంథని రాజకీయం మారిపోయింది. నలుగురు అభ్యర్థులు మొత్తంగా నియోజకవర్గమంతా పరిచయాలు, సన్నిహిత సంబంధాలు కలిగిన వారే. సునీల్ రెడ్డి, చల్ల నారాయణరెడ్డిలు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయటం ఇదే ప్రథమం. నామినేషన్ ల ఘట్టం ముగియగానే మంథనిలో ప్రచార హోరు మిన్నంటనున్నది.