ఒడ్డెర కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తా..

ఒడ్డెర కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తా..
  • ఒడ్డెర కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తా..
  • ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అంతర్గాం ఒడ్డెర కాలనీలో మౌలిక వసతులు కల్పించి, భవన నిర్మాణ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఒడ్డెర కులస్తులను ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించడంతోపాటు సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తానని నిజామబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో గు నిర్వహించిన సమావేశంలో అంతర్గాం ఒడ్డెర కాలనీ మాజీ సర్పంచ్ గంగాధర్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో వసూలు చేస్తున్న సెస్ కార్మికుల సంక్షేమానికి వెచ్చించాలని,  శ్రమకు నిర్వచమైన ఒడ్డెర కులస్తుల హక్కుల రక్షణకు తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. ఒడ్డెరకాలనీలోని పాఠశాలకు ప్రహారి నిర్మాణంతోపాటు అదనపు గదులు నిర్మాణం చేపడుతామన్నారు. అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. చౌకధరల దుకాణం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం నుండి రూపాయి సాయం ఆశించకుండ రామాలయ నిర్మాణానికి విరాళాలు సేకరించుకొని నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఒడ్డెర కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.20లక్షలు కేటాయించామన్నారు. రామాలయ నిర్మాణానికి సీజీఎఫ్ నిధుల నుండి రూ.50లక్షల నిధులు మంజూరు చేస్తామని జీవన్రెడ్డి హామీ ఇచ్చారు. అంతర్గాంలోని ఆంజనేయస్వామి ఆలయానికి రూ.1కోటి నిధులు కేటాయించామని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచి, ఎంపీగా గెలిపించి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.