గజ్వేల్ లో జర్నలిస్టు ఆత్మహత్య

గజ్వేల్ లో జర్నలిస్టు ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా, గజ్వేల్ కేంద్రంగా ఓ పత్రికలో పనిచేస్తున్న రిపోర్టర్ వేణుగోపాల్(34) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుండి బయలుదేరిన అతను, నిన్నటి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేణు ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసులు, గజ్వేల్ పట్టణంలోని ఎర్రకుంటలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఆన్లైన్ అప్పుల భారం, వాటి వేధింపులు భరించలేక వేణు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతునికి భార్య, రెండేళ్ల వయస్సున్న ఇద్దరు కవల ఆడ పిల్లలున్నారు.

మృతదేహాన్ని సందర్శించిన విరాహత్

ఆత్మహత్య చేసుకున్న రిపోర్టర్ వేణు మృతదేహాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ గజ్వేల్ మార్చురీలో సందర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. తమ సంఘంలో క్రియాశీలకంగా పనిచేసిన వేణు అకాల మరణం తీరని విషాదాన్ని మిగిల్చినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేణు కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. వేణు ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విరాహత్ అలీ తో పాటు గజ్వేల్ పాత్రికేయులు ఎన్నెల్లి సురేందర్, క్రిష్ణ, సతీష్, పప్పు, బాల్ చంద్రం తదితరులు మార్చురీలో వేణు మృతదేహాన్ని సందర్శించారు.