ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే ప్రభుత్వం

ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే ప్రభుత్వం
  • తప్పకుండా ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తాం*
  • మంత్రి జూప‌ల్లి కృష్ణారావు 

ముద్ర.కొల్లాపూర్:-అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.పెంట్లవెళ్లి మండల కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూప‌ల్లి పాల్గొని ప్రజల నుండి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి  మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే  రెండు ప్రధానమైన స్కీములు అమలు చేశామని, మిగతా వాటిని కూడా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు.ప్ర‌తీ నెల‌లో 15 రోజుల పాటు కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాన‌ని, ప్ర‌తీ ఇంటికి తిరుగుతూ... ప్ర‌తి ఒక్క‌రినీ క‌లిసి వారి క‌ష్టసుఖాల్లో పాలుపంచుకుంటాన‌ని హ‌మీనిచ్చారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని చెప్పారు. నిజాయితీ, నిబద్ద‌తో ప‌ని చేసి ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకుంటాన‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు,నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.