పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య ఉండొద్దు..

పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య ఉండొద్దు..
  • అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి...
  • ప్రభుత్వ భూములను కాపాడాలి..
  • పనిచేయని అధికారులపై చర్యలు తప్పవు..
  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  హాజరై మాట్లాడుతూ త్రాగునీటి విషయంలో సంబధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెరువు శిఖాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని అధికారులకు సూచించారు. అన్ని వార్డుల్లో మిషన్ భగీరథ నీటిని సక్రమంగా సరఫరా చేయాలని కోరారు. నియోజకవర్గంలో పనిచేయని అధికారులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు వార్డు కౌన్సిలర్లు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఎమ్మెల్యే త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. పది రోజుల్లో సమస్యలు లేకుండా అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.