ఓగులాపూర్ భూ నిర్వసితులకు న్యాయం చేస్తాం

ఓగులాపూర్ భూ నిర్వసితులకు న్యాయం చేస్తాం
  • ఓబులాపూర్ రైతులకు అన్యాయం జరిగిన మాట వాస్తవం
  • కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం
  • గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పొన్నం, అలిగిరెడ్డిల సంయుక్త ప్రకటన

చిగురుమామిడి ముద్ర న్యూస్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మండలంలోని ఓగులాపూర్ భూ నిర్వసితులకు న్యాయం చేస్తామని, ఓబులాపూర్ రైతులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు అన్నారు. అధికారంలోకి రాగానే వారికి న్యాయం జరిగే విధంగా భూ నిర్వాసితుల డిమాండ్లను పునః పరిశీలన చేస్తామని మాట ఇచ్చారు. చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓగులాపూర్ భూనిర్వశితుల పై ముద్ర న్యూస్ అడిగిన ప్రశ్నకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డిలు పై విధంగా స్పందించారు. మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పొన్నం, అల్గిరెడ్డిలు పాల్గొన్నారు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల పైన గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కట్టారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించారని, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు ఇలా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి మోసగించిందని గ్రామంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టెయ్యలేని అసమర్థ ప్రభుత్వం మని వారు దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోని రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ అంటే రైతులు, రైతులంటే కాంగ్రెస్ అన్నారు.మా హయాంలో ఐకెపి సెంటర్లను తీసుకువచ్చి రైతుల నుండి ధాన్యం సేకరిస్తే... ఇప్పటి ప్రభుత్వం బస్తాకు నాలుగు కిలోల చొప్పున రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి మాయమైందని..ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో మండల కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నింపింది.