అసైన్డ్​ భూములు గుంజుకోం... పట్టాలిస్తాం నర్సాపూర్ సభలో సీఎం కెసిఆర్

అసైన్డ్​ భూములు గుంజుకోం... పట్టాలిస్తాం నర్సాపూర్ సభలో సీఎం కెసిఆర్

నర్సాపూర్ సభలో సీఎం కెసిఆర్

ముద్ర ప్రతినిధి, మెదక్: కొంతమంది మళ్లీ బీఆర్​ఎస్​ ప్రభుత్వం వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన అసైన్డ్​ భూములు గుంజుకుంటుందని చెబుతున్నరు..ఇదంతా అబద్దం... ఎవరి భూములు పోవు, దళిత, గిరిజన ఎమ్మెల్యేలు కోరిక మేరకు సంబంధిత రైతులకు పట్టాచేసి హక్కులు కల్పిస్తాం... అసత్య ప్రచారాలు నమ్మెద్దు అని బీఆర్ఎస్​ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ హామినిచ్చారు. గురువారం సాయంత్రం మెదక్ జిల్లా నర్సాపూర్​లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. మూడేండ్లు ఎంతో కష్టపడి ధరణి తీసుకొస్తే కాంగ్రెసోళ్లు దానిని బంగాళాఖాతంలో వేస్తమంటున్నారు. అది జరిగితే కైలాసంలో పెద్దపాము మింగినట్టే అయితదన్నారు. మళ్లీ భూముల కబ్జాలు, జుట్లు ముడేసుడు, తాకట్లు పెట్టుడు, వకీళ్ల సుట్టు తిరుగుడు మొదలైతయిదన్నారు. భూముల ధరలు ఇపుడు ఎట్లా పెరిగాయి, ధరణి లేకుంటే ఎన్ని కొట్లాటలు, హత్యలు అయితుండే ఆలోచించాలన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్​ పాలనలో తెలంగాణా ఎట్లుండే, పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో ఎట్ల అయిందో బేరీజు వేసుకోవాలని కేసీఆర్​ సూచించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. వందల్లో ఉన్న పెన్షన్​ వేలల్లోకి తీసుకుపోయింది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే అనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇప్పటికి ఇంకా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెన్షన్​ వందల్లోనే ఇస్తున్నారన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి వెనకాల ఉన్న పార్టీ చరిత్ర చూడాలని, అవకాశం ఇస్తే ఎలాంటి నడక నడుస్తది ఆలోచించాలని కోరారు. మనకు మంచి ఎవరితోని జరుగుతది గుర్తించి ఓటేయాలన్నారు. 50 ఏండ్లు ఏడిపించి గోస పెట్టిన పార్టీ కాంగ్రెస్​ అని, తొలి దశ తెలంగాణా ఉద్యమంలో 400 మందిని కాల్చి చంపి, లక్షల మందిని జైళ్లో పెట్టిన పార్టీ అని దుయ్యబట్టారు. బీఆర్​ఎస్​ పార్టీ తెలంగాణా ప్రజల కొరకు, హక్కుల కొరకు, రాష్ట్ర సాధన కోసం పుట్టిందని చెప్పారు. నర్సాపూర్​ ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ కోరారు. ఈ సభలో మంత్రి హరీశ్​ రావ్​, నర్సాపూర్​ బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్​ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, రఘోత్తంరెడ్డి, జెడ్పీ చైర్​ పర్సన్​ హేమలత తదితరులు పాల్గొన్నారు.