పట్టా లేకపోయినా పక్కా గా ప్రాక్టీస్

పట్టా లేకపోయినా పక్కా గా ప్రాక్టీస్
  • ఆర్ఎంపి ల పైనే ఆధారం
  • కోదాడ పట్టణంలో సగానికి పైగా స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వని వారే

ముద్ర ప్రతినిధి,కోదాడ:- కోదాడ పట్టణంలో కొంతమంది ఎండి డాక్టర్లు అని చెప్పుకొని స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వకుండానే మరొకరి ఎంబిబిఎస్ పట్టా తో హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని హాస్పిటల్ బోర్డు పై పట్టా లేని డాక్టర్ పేరు ప్రక్కన ఏకంగా ఎండి అని వ్రాయించుకొని ప్రజలను నమ్మించి ప్రాక్టీస్ చేస్తున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం . 

అసలు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏమిటి?

ఎలాంటి ఎంట్రెన్స్ టెస్ట్ లు లేకుండా కొన్ని దేశాలలో వైద్య విద్య పూర్తి చేసుకొని ఇండియాలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయిన వారికే ఎంసిఐ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తుంది . ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే డాక్టర్ గా ప్రాక్టీస్ చెయ్యాలి . అదేవిధంగా వారు ఏ దేశంలో అయితే వైద్య విద్య పూర్తి చేశారో ఆ దేశం పేరు కూడా బోర్డు పైన తప్పకుండా వ్రాయాలి . వీరికి మాత్రమే ఇండియన్ మెడికల్ అసోషియేషన్ లో సభ్యత్వం ఇస్తారు . కానీ ఈ నిబంధనలేవీ పాటించకుండా దర్జాగా పట్టణంలో ఎండి డాక్టర్ అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని దర్జాగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చి రాని వైద్యంతో రోగులను గుల్ల చేస్తున్నా అధికారులు మాత్రం అసలు అలాంటి వారే లేరన్నట్లు వ్యవహరిస్తున్నారు .

పట్టణంలో సగం పైగా ఫేక్ ఎండి లే

కోదాడ పట్టణంలో సుమారు 15 మంది ఎండి డాక్టర్లని ప్రాక్టీస్ చేస్తుండగా అందులో నలుగురైదుగురు మాత్రమే స్వదేశంలో వైద్య విద్య పూర్తి చేసిన వారు ఉన్నారు . మిగతా పది మందిలో సగం మందికి పైగా స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వకుండానే ప్రాక్టీస్ చేస్తున్నారు . వీరిలో ఒకరిద్దరు తప్ప మిగతావారందరు ఆర్ఎంపి ల పైన ఆధారపడి ప్రాక్టీస్ చేస్తున్నవారే ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు . కేవలం వారి స్వలాభం కోసం ఆర్ఎంపి లు కూడా ఈ ఫేక్ ఎండి ల దగ్గరికే పేషంట్లను తీసుకెళ్లి రోగం తగ్గించకుండా అమాయకుల ఆరోగ్యం గుల్ల చేస్తున్నారు . 

డిఎంఎచ్ఓ డాక్టర్ కొటాచలం వివరణ

కోదాడ పట్టణంలో స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వకుండా కొంత మంది ఎండి బోర్డు పేరుకొని డాక్టర్ గా చెలామణి అవుతూ హాస్పిటల్స్ నడుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది . అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు నమోదు చేసి కచ్చితంగా జైలుకు పంపుతాం .