అల్లదిగో.....పాలనాసౌథం

అల్లదిగో.....పాలనాసౌథం
  • సర్వాంగ సుందరంగా ముస్తాబు 
  • మంత్రి జగదీష్ రెడ్డి నిరంతర పర్యవేక్షణ లో
  • సకల హంగులతో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం 
  • 21 ఎకరాల్లో 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో
  • జీ ప్లస్‌ టు అంతస్తుల్లో 37 శాఖలకు గదులు, ఉద్యోగుల కోసం క్వార్టర్స్ 
  • 10 ఎకరాల్లో గ్రీనరీ, ల్యాండ్‌ స్కేప్‌ సూర్యుడి ఆకారంలో హెలిప్యాడ్‌ పార్క్‌
  • రాష్ట్రంలోనే తొలిసారిగా సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు
  •  రూ. 65 కోట్లతో పూర్తి చేసిన ప్రభుత్వం
  • ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నద్ధం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి నిరంతర పర్యవేక్షణ లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్‌ సకల హంగులతో నిర్మాణం పూర్తయ్యింది. పచ్చని చెట్లు, చుట్టూ గ్రీనరీ, విశాలమైన భవనాలు, క్వార్టర్లతో సిద్ధమైంది. పట్టణ పరిధి కుడకుడలో 21 ఎకరాల్లో 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిపాలన భవనంతోపాటు అధికారుల కోసం నివాస సముదాయం నిర్మించారు. రెండతస్తుల భవనంలో కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ చాంబర్లతోపాటు మొత్తం ఒకే చోట 37శాఖలు ఉండేలా గదులు కేటాయించారు. రాష్ట్రంలోనే తొలి సారిగా సౌర విద్యుత్‌తో కార్యాలయాలు నడిచేలా ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 65 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దంగా ఉంది. ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూర్యాపేట పర్యటనకు రానున్న నేపథ్యంలో దీనిని ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
 
పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల సమయంలో సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వగా.. ఆ మేరకు 2016లో కొత్త ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2017 అక్టోబర్‌ 12న కలెక్టరేట్‌ భవనానికి భూమి పూజ చేశారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పచ్చదనం, ఉద్యోగుల సౌకర్యాలు కల్పించారు. శాఖల గదుల కేటాయింపు చేశారు. 20 న సిఎం ప్రారంభించిన మరుసటి రోజు నుంచే ఇక్కడి నుంచి పరిపాలన చేసేందుకు అన్ని శాఖలు సిద్ధమయ్యాయి. దివ్యాంగులు, వృద్ధులు మొదటి, రెండో అంతస్తుల్లో ఉన్న కార్యాలయంలోకి వచ్చేందుకు ఇబ్బంది పడకుండా రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు.

  •  శాఖల వారీగా గదుల కేటాయింపు

సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో గదుల కేటాయింపు దాదాపు పూర్తికావచ్చింది. దాదాపు 35 శాఖలు ఇక్కడ ఉండేలా గదులను కేటాయించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కలెక్టర్‌ చాంబర్‌తోపాటు ఇద్దరు అదనపు కలెక్టర్ల చాంబర్లు ఏర్పాటు చేశారు. వారి సహాయకులు ఉండేందుకు ప్రత్యేక చాంబర్లు, వాటి సమీపంలోనే దాదాపు 500 నుంచి 650 మంది కూర్చునేలా మీటింగ్‌ హాళ్లు, రెండు వీడియో కాన్ఫరెన్స్‌ హాళ్లను సైతం సిద్ధ్దం చేశారు. వీటితోపాటు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆయా శాఖలకు గదులను కేటాయించారు. మొదటి అంతస్తులో జిల్లా మంత్రి చాంబర్‌ను, వారి సిబ్బందికి కూడా ప్రత్యేక చాంబర్‌ ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో మినీ మీటింగ్‌ హాల్‌, రెండో అంతస్తులో శాఖల వారీగా గదులను కేటాయించారు. ఉద్యోగుల సంఖ్య ఆధారంగా శాఖలకు గదులను ఏర్పాటు చేశారు. ఒకరిద్దరు ఉద్యోగులు ఉన్న శాఖలకు ప్రత్యేకంగా క్యాబిన్లు ఏర్పాటు చేసి ఇవ్వనున్నారు.

  •  గ్రీనరీకి అధిక ప్రాధాన్యం 

ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా పచ్చదనం ఉట్టిపడేలా సూర్యాపేట సమీకృత కలెక్టరేట్‌లో ఏర్పాట్లు చేశారు. గ్రీనరీకి దాదాపు పది ఎకరాలకు పైగా కేటాయించారు. పార్కులను తలపించేలా ల్యాడ్‌స్కేప్‌లను తయారు చేశారు. గ్రీనరీ కోసం 70 రకాల మొక్కలు నాటారు. భవనానికి ముందు దాదాపు 4ఎకరాల్లో పచ్చని చెట్లు, పెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ సముదాయంలో నిర్మించిన హెలిప్యాడ్‌ చుట్టూ సుమారు 4ఎకరాల స్థలంలో పార్కులను తలపించేలా గ్రీనరీ పెంచారు. హెలిప్యాడ్‌ చుట్టూ సూర్యుడి ఆకారంలో మొక్కలను నాటారు. కలెక్టరేట్‌ భవనం మధ్యలో సెంట్రల్‌ కోర్టును కూడా పార్కులను తలపించేలా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని 65వ నెంబర్‌ జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్డు నుంచి కలెక్టరేట్‌ వరకు వచ్చే 3కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసలలో మొక్కలు నాటారు.

  •  రూ.65 లక్షలతో సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ 

రాష్ట్రంలోనే తొలిసారిగా సూర్యాపేట సమీకృత కలెక్టరేట్‌ భవనంలో సోలార్‌ ఎనర్జీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. రూ.65 లక్షల వ్యయంతో 100 కిలో వాల్ట్‌ల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను కలెక్టరేట్‌ భవనంపై ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్‌ను ఎక్కువగా వినియోగించుకునే విధంగా రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుటకండ్ల జగదీశ్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావ్‌ పత్యేక చొరవతో ఏర్పాటు చేయించారు. ఇప్పటికే ప్లాంట్‌ ఫిట్టింగ్‌ పూర్తి కాగా.. ఒకటి, రెండ్రోజుల్లో విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వనున్నారు.

  •  99 శాతం పనులు పూర్తి 

సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు 99 శాతం పూర్తయ్యాయి. కలెక్టరేట్‌ భవనంలోకి ప్రవేశించడానికి రెండు మార్గాలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ చుట్టూ ప్రహరీ నిర్మించారు. సముదాయం చుట్టూ తిరిగే విధంగా తారు రోడ్డు వేశారు. గ్రీనరీలో నడిచే విధంగా వాకింగ్‌ ట్రాక్‌లను నిర్మించారు. డ్రైనేజీ సిస్టమ్‌, కార్యాలయంలో ఉద్యోగులు, ప్రజల కోసం వాష్‌రూమ్‌లు, కార్యాలయాలకు వచ్చే ప్రజలు వేచి ఉండే ప్రాంతాల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.

  •  కలెక్టరేట్‌కు మిషన్‌ భగీరథ నీరు 

కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు, అధికారులు, ఉద్యోగులకు మిషన్‌ భగీరథ నీటిని ఇవ్వనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్‌ సముదాయంలో 1.20 లక్షల లీటర్ల సామర్థం గల ట్యాంక్‌లు నిర్మాణం చేశారు. వాటిని మిషన్‌ భగీరథ నీటితో నింపి సరఫరా చేయనున్నారు. ఇందుకు స్థానిక ఖమ్మం రోడ్డులోని మిషన్‌ భగీరథ ట్యాంక్‌ నుంచి రూ.86 లక్షలతో ప్రత్యేకంగా పైపులైన్‌ ఏర్పాటు చేశారు.