ఆర్ కృష్ణయ్యను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం..   

ఆర్ కృష్ణయ్యను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం..   

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య  జోలికి వస్తే మూల్యం చెల్లించక  తప్పదని,  ఎన్నికల ముందు బీసీల ఆగ్రహానికి గురి కావొద్దని సియం కేసీఆర్ ను  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఆర్. కృష్ణయ్యను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసిల్ చౌరస్తాలో బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు కేజీబీవీ, యుఆర్ఎస్ ఉద్యోగుల కనీస వేతనాలను చెల్లించాలని, ఒప్పంద ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంగా ఉద్యోగస్తుల నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వెళ్లిన ఆర్. కృష్ణయ్యను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు.

ఒప్పంద ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ వారు చేస్తున్న దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించిన పోలీసు చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం వెంటనే ఆ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆర్. కృష్ణయ్య ప్రజల మనిషి అని, ప్రజా ఉద్యమాలతో ఎదిగిన వ్యక్తి అని అందుకే ప్రజా ఉద్యమాలలో తన వంతుగా ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చింతల గంగాధర్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సహకార్యదర్శి అలిశెట్టి ఈశ్వరయ్య జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు కొక్కు గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనుమల్ల సంజయ్ సామ్రాట్, బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు తిరుపురం రాంచందర్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీకూరి శ్రీహరి, బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు రాపర్తి రవి, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, గొల్లపెల్లి మహిపాల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.