మెడికల్ హబ్ గా సూర్యాపేట

మెడికల్ హబ్ గా సూర్యాపేట
  • సూర్యాపేట కు తలమానికం మెడికల్ కళాశాల భవనం
  •  రూ.156  కోట్లతో..20 ఎకరాల లో నిర్మాణం
  •  6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాదునిక సదుపాయాలు
  • కాలేజ్ జీ+5, బాలుర హాస్టల్ జీ+5, బాలికల హాస్టల్ జీ+5, ప్రిన్సిపల్, సిబ్బంది క్వాటర్స్ జీ+5,
  • 6ఎకరాల్లో పచ్చదనం 
     

ముద్ర ప్రతినిధి సూర్యాపేట :-గత పాలకుల హయాంలో కుంటుపడిన విద్యారంగాన్ని ప్రజల కు చేరువ చేసేందుకు అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులను బలోపేతం చేస్తూనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేశారు. తొలి దశలోనే మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో సూర్యాపేట కు మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన  కేసీఆర్ సూర్యాపేట పై ఉన్న ప్రత్యేక ప్రేమను చాటారు. మూడేళ్ల కిందటే పాలిటెక్నిక్ కళాశాలల భవనం లో మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించగా సూర్యాపేటకి తలమానికంగా ఉండే విధంగా శాశ్వత భవనానికి శ్రీకారం చుట్టారు. మంత్రి జగదీష్ రెడ్డి రాజీలేని నిరంతర పర్యవేక్షణ , చొరవ  తో సకలసౌకర్యాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలతో రూ.156 కోట్ల వ్యయం, 20 ఎకరాల విస్తీర్ణం, ఆరు  లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో మెడికల్  కాలేజ్ భవనాన్ని నిర్మించి పేదలకు, సామాన్య ప్రజలకు వైద్య సేవలను మరింత దగ్గరకు చేర్చారు. 'నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు' అనే రోజులు పోయి 'ఏం చక్కా పోవచ్చు సర్కారు దావఖానకు' అనేలా మెడికల్ కళాశాలను రూపుదిద్దారు. సూర్యాపేట ముఖ ద్వారంలో నిర్మితమైన మెడికల్ కళాశాల భవనాన్ని ఈ  నెల 20న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

20 ఎకరాల స్ధలంలో 6 లక్షల చదరపు అడుగుల సామర్ధ్యంతో కళాశాల భవనంతోపాటు బాలుర, బాలికలకు వేరు వేరు ప్రిన్సిపల్‌ క్వాటర్స్‌ ఏర్పాటుచేశారు. బాలుర, బాలికలకు వేర్వురు ప్రిన్సిపల్‌ క్వాటర్స్‌ ఏర్పాటుచేశారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య 700 మంది కాగా, 900 మంది వరకు ఉండేందుకు వీలుండేలా హాస్టళ్లు సిద్ధమయ్యాయి. మెడికల్‌ కళాశాలలో ఆవరణలో ఆహ్లాదకర వాతావరణం కోసం 6  ఎకరాలతో పార్కుల ను తీర్చి దిద్దారు.

  • 8 విభాగాలుగా భవన నిర్మాణం

నిరుపేదల దేవాయలంగా విరాజిల్లనున్న సూర్యాపేట మెడికల్‌ కళాశాల భవనం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంది. భవనాన్ని వేగంగా నిర్మాణం చేసేందుకు ఎనమిది విభాగాలుగా విభజించి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఐదు బ్లాకుల్లో తరగతి గదులు, లెక్చరర్స్‌ గ్యాలరీ, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌, ఒక బ్లాక్‌లో అకడమిక్‌ అండ్‌ ఎగ్జామినరీ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయోగశాల బ్లాక్‌, డిపార్ట్‌మెంట్‌ బ్లాక్‌తోపాటు వైద్య విద్యార్థులకు రెస్టారెంట్‌ అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపట్టారు. బాల, బాలికలకు వేర్వురుగా హాస్టల్‌ భవనాలు, ప్రిన్సిపాల్‌ క్వార్టర్స్‌ పేరుతో పని విభజన చేసి మెడికల్‌ కళాశాల భవనాన్ని శరవేగంగా నిర్మించారు.

  • 900 మందికి వసతి కల్పించేలా హాస్టల్స్‌

మెడికల్‌ కళాశాలలో మొదటి నుంచి చివరి సంవత్సరం వరకు మొత్తం 700 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తారు. వీరిలో 450 మంది బాలురు, 250 మంది బాలికలు ఉంటారు. వీరిలో కేవలం 60 శాతం మందికి మాత్రమే హాస్టల్‌లో వసతి కల్పించాలని వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలున్నాయి. విద్యార్థులు కాకుండా ప్రతి హాస్టల్‌కు కుకింగ్‌, క్లీనింగ్‌, సెక్యురిటీ, ధోబీ ఇతర పనులకు సంబంధించి మరో 60 మంది సిబ్బంది ఉంటారు. అయితే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని 900 మందికి కూడా వసతి కల్పించేలా విశాలమైన హాస్టల్‌ భవనాలను నిర్మించారు. బాలురకు జీ+5, బాలికలకు జీ+5తో నిర్మాణాలు చేశారు. ఇవే కాకుండా ప్రిన్సిపాల్‌, అసిస్టెంట్‌ ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు ఉండేందుకు వీలుగా జీ+5 సామర్థ్యంతో, టీచింగ్ నాన్ టీచింగ్ క్వార్టర్స్‌ పేర జీ+5 భవనాన్ని కూడా నిర్మించారు.

  • పచ్చదనం కోసం గ్రీనరీ ఏర్పాటు

కళాశాల భవనంలో ఇంటర్నల్‌ రోడ్లు, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణంతోపాటు అన్ని విధాలుగా మెడికల్‌ కాలేజీ నిర్మాణం జరిగింది. అలాగే కళాశాల ఆవరణలో పచ్చదనం వెల్లివిరిసేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ఏకంగా 6 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో రకరకాల మొక్కలతో గ్రీనరీ పార్క్‌ను ఏర్పాటు చేశారు . కాలేజీకి అవసరమైన స్థలం అందుబాటులో ఉండడంతో రాష్ట్రంలోనే మంచి మెడికల్‌ కాలేజీగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారు.