రేపటినుంచి పెద్ద జయంతి ఉత్సవాలు...

రేపటినుంచి పెద్ద జయంతి ఉత్సవాలు...

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో రేపటి నుంచి ఈ నెల 14 వరకు పెద్ద జయంతి  ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో టంకశాల వెంకటేష్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 12 నుంచి 14 వరకు జరగనున్న ఉత్సవాల సందర్బంగా గురువారం సాయంత్రం నుంచి పుజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతాయని ఈవో పేర్కొన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని  ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించిన ఆయన, భక్తులు తమకు సహకరించి స్వామివారి సేవలో తరించాలని విజ్ఞప్తి చేశారు.కాగా, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పెద్ద జయంతి ఉత్సవాలకు పలువురు మంత్రులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఆలయ అధికారులు తెలిపారు.

జయంతికి కొండగట్టులోనే.. పట్టు వస్త్రాల తయారీ...
జయంతి ఉత్సవాల సందర్బంగా పట్టు వస్త్రాలు గుట్టపైనే తయారు చేస్తున్నారు. సికింద్రాబాద్ గణపతి దేవస్థానం ట్రస్ట్, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి ఆధ్వర్యంలో నలుగురు చేనేత కళాకారులు  కొండగట్టు హరిత హోటల్ లో మగ్గం ఏర్పాటు చేసి, పోచంపల్లి చేనేత పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు. గత మూడు సంవత్సరాలనుండి ఆలయ ఈవో కోరిక మేరకు తాము నియమ, నిష్టలతో స్వామివార్లకు పట్టు వస్త్రాలు నేస్తున్నట్లు చేనేత కళాకారులు గుర్రం శ్రీనివాస్, సంతోష్ కుమార్, జానయ్య, గణేష్ తెలిపారు. ఈ పట్టు వస్త్రాలు ఉత్సవాలకు అందజేయనునట్లు తెలిపారు. కాగా, కొండగట్టుతో పాటు పలు ప్రముఖ దేవాలయాలకు కూడా తాము పట్టు వస్త్రాలు నేచి, అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.