సభలో కేటీఆర్ కు తొమ్మిది సంవత్సరాల అభివృద్ధిపై నివేదన ఇవ్వనున్న ఎమ్మెల్యే

సభలో కేటీఆర్ కు తొమ్మిది సంవత్సరాల అభివృద్ధిపై నివేదన ఇవ్వనున్న ఎమ్మెల్యే
  • తిరుమలగిరి సభతో ఎన్నికల శంఖారావం మోగించనున్న ఎమ్మెల్యే
  • సభకు అతిరథ మహారధులు హాజరు
  • తిరుమలగిరి సభ తో ఒకపక్క అభివృద్ధి వివరణ మరోపక్క బలప్రదర్శనతో విపక్షాలకు సవాల్ విసరనున్న ఎమ్మెల్యే 

తుంగతుర్తి ముద్ర:తుంగతుర్తి నియోజకవర్గం అని రంగాల్లో అభివృద్ధి చేసి, రాజకీయంలో తనకు ఎదురు లేకుండా విపక్ష పార్టీలకు అభివృద్ధి విషయంలో విమర్శించేందుకు ఎంత మాత్రం తావు ఇవ్వకుండా, తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ముందుకు సాగుతున్నారు . రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, నియోజకవర్గంలో అడపా,దడప చిన్న ,చితక విమర్శలు చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ బహిరంగ సభకు సుమారు 40,000 మందికి పైగా కార్యకర్తలను తరలించేందుకు ఎమ్మెల్యే వ్యూహరచన చేశారు .

ఈనెల 27న జరిగే ఈ భారీ బహిరంగ సభకు కేటీఆర్ తో పాటు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తో పాటు మిగతా శాసనసభ్యులు, రాజ్యసభ సభ్యులను సైతం ఆహ్వానించారు ,ముఖ్యంగా గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో ,నియోజకవర్గంలో జరిగిన వేల కోట్ల రూపాయల అభివృద్ధిని సభాముఖంగా అటు పార్టీ నాయకత్వం ముందు ,ఇటు వేలాది మంది సభా సదులకు ,అలాగే నియోజకవర్గ ప్రజలకు నివేదించేందుకు ఎమ్మెల్యే ఏర్పాటు చేసుకున్న భారీ బహిరంగ సభ అని చెప్పవచ్చు.

అలాగే ఇదే సభలో కేటీఆర్ మరో మారు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ బరిలో ఉంటారనే మాట సైతం చెప్పే అవకాశం ఉంటుందని, దీని ద్వారా పోటీపై గుసగుసలాడే వారికి సమాధానం చెప్పినట్లు అవుతుందనేది పార్టీ శ్రేణుల భావన. గతంలో సైతం ఎన్నికల ముందు జరిగిన సభలోనే ముందస్తుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అనే మాట చెప్పడం జరిగింది. ఈసారి కూడా అదే తీరులో అభ్యర్థిగా ఎమ్మెల్యే ను ప్రకటించవచ్చని మాట వినవస్తోంది. నియోజకవర్గం లో తన బలాన్ని సభ ద్వారా అటు అధినాయకత్వానికి ,చూపించడం ఒకటైతే మరో విధంగా విపక్షాలకు సభ సక్సెస్ చేసి ,ఇదే సభ ఎన్నికల శంఖారావ సభగా సవాల్ విసిరే యోచనలో ఎమ్మెల్యే అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి చేయడంలో ఉన్న వేగం సభ నిర్వహణ, అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఎమ్మెల్యే దిట్ట. రాజకీయంగా గత రెండు ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సరిదిద్దుకొని, ఈసారి ఎలాగైనా భారీ మెజారిటీతో గెలవాలని వ్యూహం ఎమ్మెల్యే రూపొందిస్తున్నారు. ఈనెల 27న జరిగే బహిరంగ సభలో నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, విమర్శకుల నోరు మూయించేందుకు ఎమ్మెల్యే వ్యూహరచన చేశారు  ఇప్పటికే విపక్షాలు ఎమ్మెల్యే పై పోటీకి బలమైన అభ్యర్థి ఎవరనే దానిపైనే చర్చించుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యర్థులు ఎవరైనా ఎన్నికల్లో విజయం తనదేనని, అందుకు అభివృద్ధి చేస్తున్న తనకు ప్రజలు అండగా నిలుస్తారనే ధీమా ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్నారు. సభకు వచ్చే రాష్ట్ర ప్రధాన నేత ,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే పేరు చెప్తారా, మరిన్ని అభివృద్ధి వివరాలు ఇస్తారా, అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే, సభ జరిగే రోజు వరకు వేచి ఉండాల్సిందే.