ప్లాస్టిక్ నిషేధం ఉత్తదేనా...?

ప్లాస్టిక్ నిషేధం ఉత్తదేనా...?
  • యథేచ్చగా వినియోగం..
  • చిన్నచిన్న షాప్ ల కే జరిమానా
  • కలెక్టర్ సమక్షంలో ప్లాస్టిక్ వాడకం 

మెట్‌పల్లి ముద్ర:- ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తాం. కవర్లు అమ్మిన, కొన్నా భారీ జరిమానా విధిస్తామని అన్న మున్నిపల్ అధికారులు ఆ మాటలు మర్చిపోయారు. షాపుల్లో పెద్ద మొత్తంలో కవర్లు అమ్ముతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండంతో ప్లాస్టిక్ వ్యర్థాలు క్వింటాళ్లలో పేరుకుపోతున్నాయి. మున్సిపల్ అధికారులు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధానికి తొలుత కఠిన చర్యలు చేపట్టారు. ఎవరూ ప్లాస్టిక్ కవర్లు అమ్మకం చేపట్టవద్దని ప్రకటన జారీచేశారు. దీనికి అనుగుణంగా కొన్ని రోజుల వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి షాపుల ఓనర్లకు జరిమానాలు వేశారు. ఎమైందో తెలియదు కానీ ఆ తర్వాత వేగం తగ్గించారు. దీంతో హోల్ సేల్ షాపు మొదలుకుని చిన్నా చిత్క షాప్ ల వరకు అందరూ కవర్లను వాడడం మొదలుపెట్టారు. తమ షాప్ లకు వచ్చే వారికి నాణ్యత లేని, నిషేధం ఉన్న కవర్లలో సరుకులు అందజేస్తున్నారు. కూరగాయలు అమ్మేవారు సైతం కవర్లను వాడుతున్నారు.దీంతో పట్టణంలో ప్లాస్టిక్ వాడకం పెరిగింది. కస్టమర్లు కవర్లు అడుగుతున్నారని ఇవ్వకుంటే సరుకులు కొనడం లేదని సాకులు చెబుతూ యథేచ్చగా వాడుతున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది రోజుకు 24 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తే అందులో దాదాపు 5 నుండి 6 క్వింటాళ్ల వరకు ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ఉంటున్నయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చిన్న చిన్న షాప్ ల కే జరిమానాలు..

ప్లాస్టిక్ ను పూర్తిగా నిసేదించెందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని. మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.అయితే మున్సిపల్ అధికారులు సిబ్బంది తో దాడులు నిర్వహించే సందర్భంలో చిన్న చిన్న షాప్ లలో దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తూ ప్లాస్టిక్ విక్రయించే దుకాణాలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయించే దుకాణాలపై చర్యలు తీసుకొని వాటిని అమ్మకుండా పూర్తిగా నిషేధిస్తే తాము కూడా వాడమని అంటున్నారు.

కలెక్టర్ సమక్షంలో ప్లాస్టిక్ వాడకం..

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని పలుచోట్ల నిర్వహించిన వేడుకలలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష తో పాటు జిల్లాకు చెందిన ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నిషేధిత ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు ప్లాస్టిక్ కవర్లు,వస్తువులు వాడితే జరిమానా విధిస్తామని ప్రకటనలు చేస్తూ. దుకాణాల యజమానులకు జరిమాణాలు విధించే మున్సిపల్ అధికారులు.ఆ విందులో కలెక్టర్ తో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్లాస్టిక్ ప్లేట్ల లో భోజనం వడ్డించారు. ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చెప్పే మున్సిపల్ అధికారులు కలెక్టర్ సమక్షంలోనే ప్లాస్టిక్ వాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

పలు అనర్థాలు...

ప్లాస్టిక్ ను ఎక్కువగా వాడుతుండడంతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భూసారం తగ్గుతుండగా, వాటిని తిన్న పశువులు జీర్ణం కాక చనిపోతున్నాయి.ఆహార పదార్థాలు కవర్లలో ప్యాక్ చేసి ఇవ్వడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కవర్లు మురుగు కాలువల్లో పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా నిలుస్తున్నాయి. చెరువులు, నదులు, కుంటల్లో చేరి నీటి కలుషితానికి కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ నిర్మూలించాలన్న లక్ష్యంతో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన వాటిని ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ కోరుట్ల నియోజక వర్గంలోని కోరుట్ల,మెట్‌పల్లి పట్టణాలతో పాటు నాలుగు మండలాల్లో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది. అధికారులు ఇప్పటికైనా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టి ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.