సామాన్యుడి కష్టాలు పట్టించుకోని రాష్ట్ర సర్కార్...

సామాన్యుడి కష్టాలు పట్టించుకోని రాష్ట్ర సర్కార్...

 ధరల నియంత్రణపై పట్టింపులేని ప్రభుత్వం కూరగాయలపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి

మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి డిమాండ్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : సామాన్యుల కష్టాలు పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ను రానున్న ఎన్నికల్లో గద్దే దించాలని, అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవెందర్ రెడ్డి అన్నారు. ఆలిండియా మహిళా కాంగ్రెస్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు పిలుపుమేరకు శనివారం జగిత్యాల లో కూరగాయల, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ అధ్వర్యంలో తహాసిల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా విజయలక్ష్మి మాట్లాడుతూ మహారాష్ట్ర కు 6 వందల కార్లల్లో ప్రచారానికి వెళ్ళిరావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు దొరికిన సమయం రాష్టంలోని సామాన్యుల కష్టాలు తెలుసుకోవడానికి తీరికలేకపోవడం బాధాకరమన్నారు.

అకాలవర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగిన నష్ట పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం మాట తప్పిందని,దిగుబడి తగ్గడంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయాని, ఇందుకు ప్రభుత్వం కూరగాయలపై సబ్సిడీ ఇచ్చి రైతులను, వినియోగదారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 9 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందించి పేద, బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకుందని విజయలక్ష్మి గుర్తు చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వం పేదలను పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు. నిత్యావసర, కూరగాయల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కేసీఆర్ హామీ ఇచ్చిన ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే సమయం లేని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లాల సరిత రమేష్ రావు, చిట్ల లత, నాగిరెడ్డి రజిత, లత, రూప, సౌజన్య, నాయకులు మన్సూర్, కౌన్సిలర్లు దుర్గయ్య, నక్క జీవన్, ముంజాల రఘువీర్ గౌడ్, గోలి శేఖర్, రజినీకాంత్, రియాజ్, సంతోష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.