మేము తలుచుకుంటే రోడ్లమీద తిరగగలరా?

మేము తలుచుకుంటే రోడ్లమీద తిరగగలరా?
  • దమ్ముంటే బందోబస్తు లేకుండా తిరగండి.
  • బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యమ్...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : నేడు 13వేల కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యమ్ విమర్శించారు. ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రతిసారి తెలంగాణకు ఏమిచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించే ఐటీ శాఖ మంత్రి 13 వేల కోట్లతో తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వస్తుంటే పాలు పంచుకోవాల్సింది పోయి నిరసనలు తెలియజేయాలని పేర్కొనడం అభివృద్ధిని అడ్డుకోవడమేనని అన్నారు. గత తొమ్మిదేళ్ల బిఆరెస్ పాలనలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని దళిత ముఖ్యమంత్రి, దళితలకు మూడు ఎకరాల భూపంపిణీ, 2021 ఆగష్టు 16 న రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదని నిరుద్యోగ భృతి ఊసే లేదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులఅందరికీ ఉచిత ఎరువుల పంపిణీ చేయలేదని అని కేజీ టు పీజీ ఉచిత విద్య అని లీకేజిలకు పాల్పడి ప్యాకేజిలకు తీసుకున్నందుకు రైతులకు ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ అని చేయక 16 లక్షల మంది రైతులను డిఫాల్టర్లుగా తయారు చేసినందుకు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రతి ఇంటిటికి తాగునీరు అందిస్తామని గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గంలో కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అని ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నిరసనల ద్వారా బిఆరెస్ ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను రోడ్లపై తిరుగకుండా అడ్డుకోగలమని అన్నారు. గత సంవత్సరం నవంబర్ 12వ తేదీన ప్రధానమంత్రి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునఃప్రారంభానికి వచ్చినప్పుడే సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇచ్చారని అయినా ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి ప్రజలను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించి ఓట్లు దండుకోవడానికి ప్రధానమంత్రి పర్యటన అడ్డుకోవాలని పిలుపునివ్వడం లిక్కర్ స్కామ్ నుండి లీకేజి స్కామ్ నుండి ఎమ్మెల్యేల కొనుగోలు స్కామ్ రాజదీప్ సర్దేశాయి చేసిన ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటిస్తే అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు తానే భరిస్తానని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో వాటి నుండి ప్రజల ద్రుష్టి మరల్చడానికి చేస్తున్న రాజకీయాలలో భాగమేనని అన్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి పర్యటనను విఫలం చేయడానికే బండి సంజయ్ ని అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించారని అన్నారు. బీజేపీ పార్టీకి కోర్టులపై నమ్మకం గౌరవం ఉంది కాబట్టే బండి సంజయ్ తన నిజాయితీని నిరూపించుకోవడానికి జైలుకు వెళ్లారని అన్నారు.నిజంగా మీ పాలన పారదర్శకంగా ఉంటే పోలీసుల బందోబస్తు లేకుండా ప్రజాక్షేత్రంలో తిరగాలని అపుడు తెలంగాణ పట్ల మీకున్న చిత్తశుద్ధి ప్రజలకు తెలుస్తుందని హితవు పలికారు. ఈసమావేశంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు పల్లె మోహన్ రెడ్డి పెంట నరేందర్ వరద రాము కాశెట్టి రాజు మూడపెల్లి తిరుపతి నెల్లి చందు తదితరులు పాల్గొన్నారు.