జర డ్రెస్ కోడ్ పాటించుండ్రి...

జర డ్రెస్ కోడ్ పాటించుండ్రి...

 కొండగట్టు ఆలయ అధికారుల తీరుపై విమర్శలు...
ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ  అధికారుల పనితీరు లో ఎంతకు మార్పు రావడం లేదు. దేవాదాయ శాఖ ఆదేశాలు భేఖతర్ చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొoదుతున్న కొండగట్టు అంజన్న క్షేత్రంకు నిత్యం వేలాదిగా, ఉత్సవాల సమయంలో లక్షలాదిగా భక్తులు వస్తుంటారు . భక్తుల్లో ఆధ్యాత్మికత పెంపోందిoచడంలో భాగంగా, అలాగే భక్తులు వారిని గుర్తించడానికి వీలుగా ఆలయ అధికారులు, సిబ్బంది డ్రెస్ కోడ్ (తెల్లదుస్తులు) తప్పనిసరిగా పాటించాలని గతంలో దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే రెండు రోజుల క్రితం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కూడా భక్తుల పట్ల మర్యాదగా మెదలాలని, వారిలో ఆధ్యాత్మిక మనోభావాలు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

డ్రెస్ కోడ్ (తెల్ల దుస్తులు.. వీలైతే షర్ట్ పంచ) పాటించాలన్న ఆదేశాలను ఆలయ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. కనీసం శ్రీరామ నవమి పండుగ  సీతారాముల కళ్యాణం రోజైన గురువారం డ్రెస్ కోడ్ పాటిస్తే బాగుండేదనుకుoటే... ఆలయ ఈవో తో పాటుగా, ఏఈవో, సూపరిoడేoట్, ఇతర సిబ్బంది ఎవ్వరూ డ్రెస్ కోడ్ పాటించలేదు. ఆలయ నియమాలకు విరుద్ధంగా మండపంపై స్టూల్స్ వేసుకొని, మరి కూర్చుండి, వీక్షించడం విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు భక్తులపై అమర్యాదగా, ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపిoచారు. ఓ అర్చకుడు అయితే మండపంపైకి ఎక్కిన మహిళా భక్తులను చేతితో తాకుతూ పక్కకు జరపడం పలువురు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికైనా దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ, భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా ఆలయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది డ్రెస్ కోడు తప్పనిసరిగా పాటించాలని పలువురు కోరుతున్నారు.