ఆరు నెలల్లో యావర్ రోడ్డును 100 ఫీట్లు విస్తరిస్తాం..

ఆరు నెలల్లో యావర్ రోడ్డును 100 ఫీట్లు విస్తరిస్తాం..
  • రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రూ.100కోట్ల నిధులు అయినా కేటాయిస్తాం..
  • పాలన పారదర్శకంగా కొనసాగాలి..
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని  యావర్ రోడ్డును ఆరు నెలల్లో 100 ఫీట్లు విస్తరిస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులతో ఎమ్మెల్సీ జివంర్ రెడ్డి  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన  మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ను  ఎమ్మెల్సీ అభినందించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ 1994 ఎన్నికలకన్నా ముందు అందరిని ఒప్పించి, ఎటువంటి పరిహారం చెల్లించకుండ పరస్పర ఒప్పందంతో 40ఫీట్ల యావర్ రోడ్డును 60ఫీట్లకు విస్తరించామని, 2014 తర్వాత 60ఫీట్ల రోడ్డును 100ఫీట్లు విస్తరించాలని తీర్మానం చేసినా, ప్రభుత్వం ఆమోదం తెలిపేందుకు ఐదేళ్లు నాన్చిందన్నారు. రోడ్డు విస్తరణలో చెల్లించాల్సిన పరిహారం చెల్లించకపోవడంతో విస్తరణ పనులు మూలనపడ్డాయని,  గత ప్రభుత్వం రోడ్డు విస్తరణకు కావాల్సిన నిధులు సమకూర్చకుండ కేవలం మాటలతో కాలం వెళ్లదీసిందని అన్నారు. దీంతో రోడ్డు విస్తరణ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.

యావర్ రోడ్డు విస్తరణకు అవసరమైతే  సియం రేవంత్ రెడ్డితో మాట్లాడి రూ.100కోట్లయినా కేటాయిస్తామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోపు ఆరు నెలల్లో యావర్ రోడ్డు 100 ఫీట్లకు విస్తరణ చేపడుతామన్నారు. బైపాస్ రోడ్డు రాజీవ్ గాంధీ విగ్రహం నుండి కరీంనగర్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ కోసం రూ.14కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు చేశామని అన్నారు. జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పదవి బలహీనవర్గాల మహిళకు కేటాయించిన స్థానాన్ని సంవత్సర కాలం నుండి భర్తీ చేయకుండ, చట్టంలో లొసుగు నెపంలో రాజ్యాంగ బద్దంగా బలహీన వర్గాల మహిళకు కేటాయించబడిన చైర్పర్సన్ పదవి స్థానాన్ని ఇతర వర్గాలకు కేటాయించి, మహిళలపట్ల వివక్షచూపారన్నారు. ఏడాదికాలంగా మున్సిపల్ పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు.

పాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యత నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పై ఉందన్నారు. వేసవి కాలం దృష్టా నిత్యం తాగునీరు సరఫరా సమయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వార్డుల వారీగా తాగునీటి సరఫరా వేళలు వెల్లడించాలని, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండ ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న వారి వివరాలు పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మున్సిపల్ పాలకవర్గంపై ఉందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, వీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సిటిజెన్ చార్ట్ ప్రకారం సేవలదించాలి.. గతంలో మున్సిపాలిటీలో ఉన్న గ్రీవెన్స్ చార్ట్ లేకపోవడంపై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనల నెపంలో ప్రజలకు అందించే సేవలను నిలుపదల చేయవద్దని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అనిల్, మున్సిపల్ ప్లోర్ లీడర్ కల్లపల్లి దుర్గయ్య, కౌన్సిల్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.