బాంబ్​బ్లాస్టులు లేకుండా మోడీ పాలన

బాంబ్​బ్లాస్టులు లేకుండా మోడీ పాలన
  • యూపీఏ హయాంలో అంతా అవినీతే!
  • 50 దేశాలకు కరోనా వ్యాక్సిన్​అందించాం
  • రూ.6,338 కోట్లతో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాం
  • కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్​రామ్ మేఘవాల్​
  • మోడీ 9 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ

ముద్ర, తెలంగాణ బ్యూరో : గత యూపీఏ హయాంలో ఎక్కడ చూసినా అవినీతి తాండవించేదని, బాంబు బ్లాస్టులు జరిగేవని, ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశవ్యాప్తంగా శాంతి నెలకొందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్​రామ్ మేఘవాల్ అన్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పాటై 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ హైదరాబాద్ లోని మాదాపూర్ దసపల్లా హోటల్లో మీడియాతో ఇంటరాక్షన్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపీ లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని 9 ఏళ్ల మోడీ పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్​రామ్​మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ అందించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడారు. దాదాపు 50 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించారు. పీఎం అవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇండ్లను నిర్మించారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల 72 లక్షల మందికి టాయిలెట్లను నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేని పేర్కొన్నారు.

9.60 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు..
ఉజ్వల యోజన కింద 9 కోట్ల 60 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించామని రామ్ మేఘవాల్​తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కొవిడ్ సమయంలో 80  కోట్ల మందికి ప్రతినెలా ఉచితంగా రేషన్ అందించామన్నారు. రూ.6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. సామాజిక న్యాయం చేస్తున్న ఘనత మోడీదేనని పేర్కొన్నారు. మోడీ హయాంలో ప్రో యాక్టివ్ గవర్నెన్స్ కొనసాగుతోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని, అందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉందని పేర్కొన్నారు. 

ఆర్థిక వృద్ధిలో ఇంగ్లండ్ ను అధిగమించాం..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్..​ఇంగ్లాండ్ ను అధిగమించి 5వ స్థానానికి చేరిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా దూసుకెళుతున్నట్లు తెలిపారు. జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ శాఖ రూ.లక్ష కోట్ల విలువైన ఉపకరణాలను ఉత్పత్తి చేస్తూ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరిందన్నారు. యెమన్, సిరియా, అఫ్గానిస్థాన్, నేపాల్, సూడాన్ లో ఉన్న దాదాపు 20 వేల మందిని భారత ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించిందన్నారు. కొవిడ్ సందర్భంగా విదేశాల్లో ఉన్న 2.97 కోట్ల మందిని స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత కేంద్ర  ప్రభుత్వానిదేనని రామ్​మేఘవాల్​పేర్కొన్నారు.