బాబోయ్ కుక్కలు.. రోజుకు పదుల సంఖ్యలో బాధితులు.. పట్టించుకోని అధికారులు

బాబోయ్ కుక్కలు.. రోజుకు పదుల సంఖ్యలో బాధితులు.. పట్టించుకోని అధికారులు

మెట్‌పల్లి ముద్ర: రోడ్డు మీద నడవాలంటే భయం.. పగలు, రాత్రి ఒంటరిగా వెళ్లాలంటే భయం. గుంపులు గుంపులుగా రోడ్డును ఆక్రమించేస్తున్న కుక్కలు నడిచి వెళ్తున్న వారిని, బైకుపై వెళ్తున్న వారిని కరుస్తున్నాయి. దీంతో పట్టణంతో పాటు పలు గ్రామాల్లో రోజురోజుకూ బాధితులు పెరుగుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. గవర్నమెంట్ దవాఖానకి ప్రతి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 5 నుండి 10 మంది కుక్క కరిచిందంటూ వస్తున్నారు. గత నెల ఒకటి నుంచి 23వ తేదీ వరకు మొత్తం 108 మంది కుక్క కాటు బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఏఆర్వీ ఇంజక్షన్లు ఇచ్చారు. రోజూ రోజు కుక్క కాటు కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నాయని కుక్కల నుండి రక్షించాలని ఎవరైనా ఫిర్యాదులు చేస్తుంటే.. కుక్కలను పట్టుకుని చంపేందుకు నిబంధనలు అడ్డుగా మారుతున్నాయంటూ సాకులు చెప్పి సంబంధిత అధికారులు తప్పించుకుంటున్నారు. వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ఉండడంతో ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు.

ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు..

ప్రజల ప్రాణాలు పోయే ఇంత తీవ్రమైన సమస్యను సంబంధిత ఆఫీసర్లు తమకు పట్ట నట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంతో పాటు పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ మనుషులపై దాడి చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. మున్సిపాలిటీ లో మున్సిపల్ అధికారులు, గ్రామాలలో గ్రామపంచాయితీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కుక్కల నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలని. మహ్మద్ ఖుతుబోద్దిన్ పాషా. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు. పట్టణంతో పాటు పలు గ్రామాల్లో వీధి కుక్కలు ఎక్కువయ్యాయి. వీటి వల్ల ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. రోడ్ల పై తిరగాలంటే భయం వేస్తుంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి..

అందుబాటులో వ్యాక్సిన్లు..డాక్టర్. సాజిద్ అహ్మద్. ఆసుపత్రి ఇంచార్జ్

పట్టణ దవాఖానలో కుక్కకాటుకు అన్ని యాంటీ ర్యాబిస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో కుక్క కాటు కేసులు నమోదు అవుతున్నాయి. గత నెల ఒకటవ తేదీ నుంచి 23వ తేదీ వరకు సుమారు 108 మంది చికిత్స పొందారు.డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్యం అందిస్తున్నారు.