ప్రజల్లో చైతన్యానికి చెత్త ఏరిన ప్రజా ప్రతినిధులు

ప్రజల్లో చైతన్యానికి చెత్త ఏరిన ప్రజా ప్రతినిధులు
  • వార్డుల్లో ఉదయాన్నే పర్యటనలకు శ్రీకారం చుట్టిన సిద్దిపేట మున్సిపల్ పాలకులు

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట:సిద్దిపేటను చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి మున్సిపల్ పాలకవర్గం కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తోంది.చెత్త మీద ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు చెత్త సేకరణకు ప్రజా ప్రతినిధులే నడుం బిగించారు.పట్టణ పరిధిలోని గ్రామీణ వార్డుల్లో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.బుధవారం ఉదయం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ,లింగారెడ్డిపల్లి గ్రామ వార్డు పరిసరాల్లో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఏరివేశారు.16వ వార్డు ఇందిరమ్మ కాలనీలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, శానిటరీ ఇనస్పెక్టర్ వనిత, ప్రస్తుత చైర్ పర్సన్ భర్త,మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు,వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు,వార్డు కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ తోపాటు ఇతర కౌన్సిలర్ లు విజేందర్రెడ్డి,సాయన్నగారిసుందర్,ప్రజా ప్రతినిధులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి,దాసరి శ్రీనివాస్,బందారం రాజు, మొయిజ్, పర్యావరణవేత్త డాక్టర్ శాంతి తదితరులు పాల్గొన్నారు. ఉదయాన్నే వార్డులలో వాకింగ్ చేస్తూ లింగారెడ్డిపల్లి రోడ్డు వైపున ఇరువైపులా అక్కడక్కడ గల పేపర్ లు,కవర్లను ఎరి సంచులలో వేశారు. వార్డులో గల ప్రజలు సైతం స్వచ్చందంగా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని చెత్తను ఏరివేశారు.ఇందిరమ్మ కాలనీలో గృహాల పక్కన,రోడ్డు పక్కన గల చెత్తను తొలగించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయటం వలన వచ్చే అనర్థాలపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు.ఇళ్లల్లో వెలుబడే చెత్తను ప్రతిరోజూ మున్సిపల్ చెత్త వాహనానికి ఇవ్వాలని బహిరంగ ప్రదేశాలలో వేసినట్లైతే దోమలు,ఈగలు వ్యాప్తి చెంది మలేరియా,డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో 
మున్సిపల్  సిబ్బంది  పాల్గొన్నారు.

పలువురికి జరిమానా

మునిసిపల్ నిబంధనలను అధిక్రమించి చెత్తను విచ్చలవిడిగా బయటపరవేసిన పలువురు వ్యాపారులకు శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత ఫైన్లు వేశారు. హోటల్ వ్యాపారికి వెయ్యి రూపాయలు, బుక్ డిపో ఓనర్ కు వెయ్యి రూపాయలు, ఆస్పత్రి వారికి 500 రూపాయలు, మొబైల్ షాప్ నిర్వాహకునికి 200 రూపాయల ఫైన్ వేసి మరోసారి చెత్తను ఆరు బయట వేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.