సలేశ్వరం జాతరలో జనంతో కిక్కిరిసిపోతున్న నల్లమల కొండలు..

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి : అమ్రాబాద్ నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర  నుండి పెద్ద ఎత్తున భక్తులు నల్లమల్లకు తరలివచ్చారు. నల్లమల్ల కొండలు లింగమయ్య స్వామి శరణు ఘోషతో మారుమోగుతోంది. దర్శనానికి వెళ్లే భక్తులు వస్తున్న లింగమయ్య అంటూ శరణు ఘోష చేస్తూ పాదయాత్ర ద్వారా లోయలో వెలిసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగు ప్రయాణం అవుతున్నారు. తిరుగు ప్రయాణంలో భక్తులు వెళ్తున్న వెళ్తున్న లింగమయ్య అంటూ భక్తులు తిరిగి ప్రయాణం అవుతున్నారు. గత ఏడాది వారం రోజుల జాతర ఉండగా ఈ ఏడాది మూడు రోజులకే అధికారులు కుదింపు చేయడంతో ఒక్కసారిగా భక్తులు వేలాదిగా తరలిరావడంతో జనం కిక్కిరిసిపోయింది. దీనితో లింగయ్య దర్శనం భాగ్యం గలక  కొంతమంది భక్తులు మార్గమధ్యలోనే తిరిగు ప్రయాణమయ్యారు. భక్తుల రాకకు తగ్గట్టుగా అధికారులు  ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్ప లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు టోల్ గేటు రుసుము  మీద చూపుతున్న శ్రద్ధ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని జాతరకు వచ్చిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనం తొక్కిసల ఆటలో కొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయి ఓ భక్తుడు గుండెపోటుతో గుండం దగ్గర మరణించడం జరిగింది. భక్తుల సంఖ్యకు తగ్గట్టు అటవీశాఖ పోలీసు రెవెన్యూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాతరకు వచ్చే భక్తులు డిమాండ్ చేస్తున్నారు.