వరంగల్ లో గుండా రాజ్యం 

వరంగల్ లో గుండా రాజ్యం 
  • కథానాయకుడు ఎమ్మెల్యే వినయ్ 
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  మండిపాటు

ముద్ర ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ గూండాల రాజ్యం నడుస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలకు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్  కథానాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోమవారం రాత్రి బీఆర్ఎస్ నాయకుల చేతిలో గాయపడిన పవన్ ను ఆస్పత్రిలో పరామర్శించిన ఆయన హన్మకొండ లోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు గంజాయి మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. అక్రమ సంపాదన కోసం ల్యాండ్, సాండ్,  మైన్, అటెంప్ట్ రేప్ లలో కూడా బీఆరెస్ నేతలే ఉంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ముఠా పవన్ ను చంపాలని ప్రయత్నించిందన్నారు. తీవ్ర గాయాలైనా పవన్ చావు నుంచి తప్పించుకున్నాడన్నారు. చైతన్యవంతమైన వరంగల్ గడ్డపై ఇలాంటి దాడులు జరగడం దుర్మార్గమని అన్నారు. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని విమర్శించారు. పోలీసులు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు శాశ్వతం కాదని అన్నారు. దాడులు చేసి వీడియోలు చిత్రీకరించి బెదిరిస్తున్నా పోలీసులు నిస్సహాయంగా ఉండటం మంచిది కాదన్నారు. ఇది యాత్రపైనే దాడిగా భావిస్తున్నామన్నారు. డీజీపీ నుంచి స్పందన లేదన్నారు.


మేం ప్రతిదాడులు చేస్తే బీఆర్ఎస్​ ఖతం 
ముద్ర తెలంగాణ బ్యూరో:  రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహశ్​కుమార్​గౌడ్​ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్​లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వరంగల్ లో యూత్​ కాంగ్రెస్ నేత తోట పవన్​పై  బీఆర్ఎస్​ గూండాలు దాడిచేయడం దారుణమన్నారు. దాడి పోలీసులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తాము ప్రతిదాడులకు దిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రం వదిలి పోవాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. అటెంప్ట్ మర్డర్ కింద వినయ్ భాస్కర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్​ చేశారు. అయిదు పర్యాయాలు ఎమ్మెల్యే అయిన దళిత‌ నేతకు గౌరవం ఇవ్వరా? అని ఆయన ప్రశ్నించారు. సాయన్నకు  బీఆర్​ఎస్​ ప్రభుత్వం బాధ కలిగింపచేసిందని ఆరోపించారు.

పిరికిపందల చర్య:  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
తోట పవన్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేయడాన్ని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆందోళనలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు.  నిందితులను అరెస్టు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు.

పవన్​ను పరామర్శించిన వీహెచ్​
సోమవారం రాత్రి వరంగల్ లో జరిగిన దాడిలో గాయపడిన యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ ను చికిత్స  కోసం సికింద్రాబాద్ అపోలోకు తరలించారు. అక్కడ ఆయనను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు పరామర్శించారు. పవన్ పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అదం సంతోష్ కుమార్, ఇతర నాయకులు ఉన్నారు.