సింగరేణిలో " గుర్తింపు" ఎన్నికలకు వేళాయె...

సింగరేణిలో " గుర్తింపు" ఎన్నికలకు వేళాయె...
  • 27న ఉదయం 7 గం.ల నుంచి సాయంత్రం 5 గంల వరకు పోలింగ్...
  • అదేరోజు ఫలితాలు వెల్లడి...
  • ఓటు హక్కు వినియోగించుకోబోతున్న 39,832 మంది
ముద్ర పెద్దపల్లి ప్రతినిధి:-రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తర్వాత  మళ్లీ అదే తరహా ఎన్నికలు సింగరేణిలో జరగబోతున్నాయి. సింగరేణి ఎన్నికల అధికారి, హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఈనెల 27వ తేదీన  ( బుధవారం) ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు గాను  దాదాపు 80 వరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సింగరేణి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా  ఈసారి బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్ ) లో విచిత్ర పరిస్థితి చోటుచేసుకుంది. యూనియన్ కు ఎలాంటి నాయకత్వం లేకుండానే యువ ఓటర్ల మీద నమ్మకంతో బరిలోకి దిగింది. కాగా 11 ఏరియాలలో  మొత్తం 39832 మంది కార్మిక ఓటర్లు బుధవారం నాడు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  27న బుధవారం ఉదయం 7:00 నుంచి  సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
అదే రోజు రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా బెల్లంపల్లి డివిజన్ లో  985 మంది ఓటర్లు, భూపాలపల్లి డివిజన్లో 5350 మంది ఓటర్లు, రామగుండం-1 డివిజన్ లో  5430 మంది, రామగుండం -2 లో 3479 మంది ఓటర్లు, అర్జీ -3 లో 3063, ఏపీఏ లో  944, మందమర్రిలో  4876 మంది, శ్రీరాంపూర్ లో 9124 మంది ఓటర్లు, కొత్తగూడెం కార్పొరేట్ లో 1192, కొత్తగూడెం డివిజన్ లో 23 70, మణుగూరులో 24 14, ఇల్లందులో 603, ఒడిశా లోని నైనీ బ్లాకులో కేవలం ఇద్దరు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలు ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి యూనియన్ల మధ్యనే పోటీ నెలకొన్నట్లు కనబడుతుంది. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదన్న ధీమాతో ఐఎన్టీయూసీ ఉండగా, పోరాట చరిత్ర కలిగి ఉన్నదన్న ధీమాతో ఏఐటీయూసీ నాయకులు గెలుపు ధీమాతో ప్రచారాలు చేపడుతున్నారు. టీబీజీకేఎస్ యూనియన్  మాత్రం కేవలం యువ ఓటర్ల మీదనే ఆధారపడి ప్రచార ఆర్భాటాలు లేకుండానే పోటీ చేస్తుండడం గమనార్హం.