యేసు నామం... మార్మోగిన మహాదేవాయం

యేసు నామం... మార్మోగిన మహాదేవాయం
  • వందేళ్ల వేడుకలకు అంకురార్పణ
  • దైవ సందేశాన్నిచ్చిన బిషప్ పద్మారావు
  • మెదక్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు 

ముద్ర ప్రతినిధి, మెదక్:విశ్వ విఖ్యాతి గాంచిన మెదక్ కెథడ్రల్ చర్చి(మహాదేవాలయం)లో క్రిస్మస్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సోమవారం తెల్లవారుజామున ప్రాతః కాల ఆరాధనతో ఉత్సవాలు మొదయ్యాయి. సీఎస్ఐ మెదక్ డయాసిస్ పరిధిలోని 13 జిల్లాల నుంచే కాక, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  తెల్లవారు జామున 4:30 గంటలకు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చి ప్రధాన వేదక మీద ప్రతిష్టించారు. అనంతరం సీఎస్ఐ మెదక్ డయాసిస్ ఇంచార్జి బిషప్ రైట్ రెవరెండ్ కె. పద్మారావు ఆధ్వర్యంలో మార్నింగ్ సర్వీస్ నిర్వహించి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి వందేళ్ల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. చలి ఉన్న లెక్క చేయకుండా పవిత్రమైనదిగా భావించే ప్రాత:కాలఆరాధనకు భక్తులు భారీగా తరలివచ్చారు.

భక్తులకు బిషప్ దైవసందేశం

ఈ సందర్భంగ ఇంచార్జి బిషప్ రైట్ రెవ కె. పద్మారావు భక్తులకు దైవసందేశాన్ని అందించారు.యెహోవాను ఎంత ఆరాదిస్తే లెక్కపేట్టలేనన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడని బిషప్ తన సందేశంలో పేర్కొన్నారు. మెదక్ అధ్యక్ష మండలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు  ప్రాముఖ్యం ఉంది. దేవుడు కృపను నాకు ఇచ్చాడు.వెలుగు, నక్షత్రం సమన్యాయం గురించి బైబిల్ చెపుతుందన్నారు. అందరిలో వెలుగు నింపడానికి మహా దేవాలయాన్ని చక్కగా ఏర్పాట్లు చేశారన్నారు. ఏసు సమస్త రక్షణకోసం పుట్టాడన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ కేథడ్రాల్ చర్చ్ నిర్మించి 99 ఏళ్లు పూర్తి అయ్యాయి.

 
వచ్చే ఏడాది వందేళ్లు పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి వచ్చే ఏడాది డిసెంబర్ 25 వరకు ఏడాది పొడుగునా శతాబ్ది వేడుకలు జరుగుతాయన్నారు. చర్చ్  ప్రత్యేకత, గొప్పదనం చాటి చెప్పేలా ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలుటాయన్నారు.వచ్చే ఏడాది డిసెంబర్ 25న జరిగే శతాబ్ది వేడుకలను చర్చ్ నిర్మాత చార్లెస్ వాకర్ ఫాస్నెట్ కుటుంబ సభ్యులు హాజరవుతరని పేర్కొన్నారు. 100 సంవత్సరాల ప్రారంభంలోకి ప్రవేశించబోతున్నామని, 100 సంవత్సరాల పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ 100 దేవాలయాలను కట్టాలని అధ్యక్ష మండల సినార్డ్ ట్రెజరర్ డా. విమల్ సుకుమార్, కమిటీ బాధ్యులతో కలిసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. శతాబ్ది సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 

కిటకిటలాడిన చర్చి ప్రాంగణం

మధ్యాహ్నం నుంచి చర్చి వద్ద రద్దీ బాగా పెరిగింది. మిషన్ కాంపౌండ్ ప్రాంగణం కిటకిటలాడింది. మెయిన్ గేట్ నుంచి చర్చ్ ప్రధాన ద్వారం వరకు జనం కిక్కిరిసి పోయారు. చర్చ్ ప్రాంగణంలోని శిలువ వద్ద టెంకాయలు కొట్టి అనంతరం క్రీస్తు జన్మవృత్తంతాన్ని తెలియజేసేలా చర్చిలో ఏర్పాటు చేసిన పశువుల పాకను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువులు భక్తులకు దీవెనలు అందించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చర్చి మొదటి అంతస్థులోకి ఎక్కి అద్దాల కిటికీల్లో నిక్షిప్తమైన ఏసుక్రీస్తు జీవన గాథలను తిలకించారు. కమిటీ బాద్యులు గెలన్, బానీ, గంట సంపత్ తదితరులున్నారు. సాయంత్రం వరకు భక్తి పాటలు ఆలపించిగా గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

బందోబస్త్ పర్యవేక్షించిన ఎఎస్పీ మహేందర్

క్రిస్మస్ జాతర సందర్బంగా చర్చి ప్రాంగణంలో భారీ పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పోలీసు కంట్రోల్ రూం, సీసీ కెమెరాలు ఏర్పాటుతో నిరంతర నిఘా పెట్టారు. ఎఎస్పీ మహేందర్ జాతరలో తిరుగుతూ ఎక్కడ ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.  డిఎస్పీ ఫణీందర్, యాదవరెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ బందోబస్త్ పర్యవేక్షించారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.