బెంగళూరు విందుకు రండి 

బెంగళూరు విందుకు రండి 
  • ప్రతిపక్ష నేతలకు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ ఆహ్వానం
  • జూలై 17, 18న సమావేశం
  • పార్లమెంట్ ఎన్నికల్లో ఐక్యతే లక్ష్యంగా భేటీ

న్యూఢిల్లీ : ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ప్రతిపక్ష పార్టీ నేతలను విందుకు ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీతో సహా 24 పార్టీలకు ఆహ్వానం పంపారు. జూలై 18న బెంగళూరులో మీటింగ్ ఉండడంతో దానికి ఒకరోజు ముందు ఈ విందు ఏర్పాటు చేశారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై కలిసి పోటీ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలను కూడగట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. అంతకుముందు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్​కుమార్ జూన్ 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. కాగా బెంగళూరు సమావేశంలో అదనంగా మరో 8 పార్టీలు కూడా పాల్గొనబోతున్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం(ఎండీఎంకే), కొంగు దేశ మక్కల్ కట్చి(కేడీఎంకే), విడుతలై చిరుతైగల్ కట్చి(వీసీకే), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(ఆర్‌ఎస్‌పీ), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్(జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) తదితర పార్టీలను ఆహ్వానించినట్లు వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ గత ప్రతిపక్ష సమావేశం సక్సెస్​అయ్యిందని, అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించామని చెప్పారు. ఇలాంటి చర్చలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని అన్నారు.  

18న జరిగే సమావేశంలో సోనియా

జూలై 17, 18వ తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ హాజరవుతారని తెలుస్తోంది. దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై పార్టీల మధ్య విస్తృత అంగీకారానికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ప్రతిపక్ష పార్టీల భేటీ ఈనెల 13నే జరగాల్సి ఉంది. కానీ, మహారాష్ట్రలో శరద్ పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో చీలిక తర్వాత ఈ సమావేశం ఈనెల 17కి వాయిదా పడింది. కాగా పాట్నాలో జరిగిన మొదటి సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలని 15 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ చివరి నిమిషంలో ఆ సమావేశానికి దూరం అవడంతో కూటమిలో ఆదిలోనే విభేదాలు బయటడ్డాయి. భవిష్యత్​లో ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ బహిరంగంగా మద్దతు ప్రకటిస్తేనే తాము భేటీకి హాజరవుతామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.  ప్రతిపక్షాల ఐక్యతే లక్ష్యంగా భేటీ అవుతున్నామని పార్లమెంట్ ఎన్నికలపై సమష్టి వ్యూహాలు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్​ నేత ఒకరు వ్యాఖ్యానించారు.