పాలక మండలికి పదవీ గండం

పాలక మండలికి పదవీ గండం
ttd governing council

టీటీడీ పాలకమండలి సభ్యులకు పదవీ గండం ఏర్పడిరది. చైర్మన్‌ భాధ్యతల నుంచి తప్పుకుని, యాక్టీవ్‌ పాలిటిక్స్‌ పై వెళ్లాలన్న వైవి సుబ్బారెడ్డి నిర్ణయం, సభ్యుల పాలిట శాపంలా మారుతోంది. చైర్మన్‌ పదవికి వైవీ రాజీనామా చేస్తే..పాలకమండలి పూర్తిగా రద్దవనుంది. అయితే తిరిగి పాలకమండలిలో తమకు చోటు దక్కుతుందా అని.. ఆశగా ఎదురు చూస్తున్నారు కొందరు సభ్యులు.తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యత్వం అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకం. పాలకమండలిలో సభ్యత్వం కోసం పైరవీలు మాములుగా వుండవు. రాష్ట్ర పరిధులు దాటి, కేంద్ర నాయకత్వం నుంచి కూడా సిఫార్సులు రావడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంటోంది వ్యవహారం. ఎన్నడూ లేని విధంగా గత పాలకమండలి ఏర్పాటు సమయంలో 25 మంది సభ్యులతో పాటు మరో 50 మందిని ఆహ్వానితులుగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ, దేవాదాయశాఖ చట్టం మేరకు ఆహ్వానితులకు పాలకమండలిలో చోటు లేకపోవడం, ఈ అంశంపై కోర్టుకెక్కడంతో 50 మంది ఆహ్వానితుల నియామకం అటకెక్కింది. 2021 ఆగస్టులో టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌ గా వైవి సుబ్బారెడ్డి నియమితులైతే, సభ్యులను సెప్టెంబర్‌ చివర్లో నియమించింది. అయినా వారి పదవీ కాలం ఆగస్టు నుంచే లెక్కింపు మొదలైంది.పాలక మండలిలో ఏపి నుంచి ఏడుగురు అవకాశం లభిస్తే?మిగిలిన సభ్యులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే.

ఒక దశలో పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేత రాజీనామ చెయ్యించి మరీ, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తిని సభ్యుడిగా నియమించింది ప్రభుత్వం. తరువాత నేర చరిత్ర కలిగిన వారికి పాలకమండలిలో సభ్యత్వం ఇచ్చారంటూ కోర్టుని ఆశ్రయించారు బిజేపి నేత భానుప్రకాష్‌ రెడ్డి. ఇక రెండు నెలలు క్రితం చీటింగ్‌ కేసులో పాలకమండలి సభ్యుడు లక్ష్మీనారాయణ అరెస్ట్‌ కావడంతో పదవికి రాజీనామా చేసారు. అతని స్థానంలో కొత్తగా దాసరి కిరణ్‌ కుమార్‌ ని సభ్యుడిగా నియమించింది ప్రభుత్వం.పదవీ కాలం 8 నెలలే వున్నప్పటికి, సభ్యత్వం లభించడమే పదివేలు అన్నట్లుగా భావిస్తున్న సమయంలో వారికి షాక్‌ తగిలింది. మరో ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర ఎన్నికలు వుండటం.విశాఖ జిల్లాకు ఇంఛార్జిగా టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం.రాజకీయంగా బీజీ కావడంతో టీటీడీ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకునేందుకు సుబ్బారెడ్డి సిద్దమైనట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే.. పదవి నుంచి సుబ్బారెడ్డి తప్పుకోవడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం కూడా మొదలయ్యింది.తదుపరి టీటీడీ చైర్మన్‌ ఎవ్వరంటూ చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు అటు ఇటు కాకూండా పోతుంది మాత్రం పాలకమండలి సభ్యులే. దేవాదాయశాఖ చట్టం మేరకు ఛైర్మన్‌ తన పదవికి రాజీనామ చేస్తే?పాలకమండలి పూర్తిగా రద్దవుతుంది. దీంతో మరో 7 నెలల పదవీ కాలం వుండగానే, ప్రస్తుత సభ్యులు మాజీలుగా మారిపోతారు. కొత్త ఛైర్మన్‌ తో పాటు ప్రస్తుతం వున్న సభ్యులు తిరిగి నియమితులవడం దాదాపుగా అసాధ్యమే. ఇద్దరు, ముగ్గురు మినహాయిస్తే.. మిగిలిన వారికి మరోసారి చోటు దక్కే అవకాశమే లేదని తెలుస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో, ఈసారి పాలకమండలిలో రాష్ట్రవాసులకే ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలన్న భావనలో ప్రభుత్వ పెద్దలు వున్నారని సమాచారం. దీంతో పదవీ కాలాన్ని పూర్తిగా అనుభవించ కుండానే మాజీలుగా మారిపోనున్నారు ప్రస్తుత పాలక మండలి సభ్యులు.