క్రీడలతో ఐకమత్యం పెంపొందుతుంది

క్రీడలతో ఐకమత్యం పెంపొందుతుంది

ముద్ర ప్రతినిధి, మహబూబాబాద్: క్రీడలతో ఐకమత్యం పెంపుతుందని, మంచి ఆలోచనలకు మార్గం పడుతుందని మహబూబాబాద్ శాసనసభ్యులు భానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం సీఎంకప్ క్రీడోత్సవాలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తారని, ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తారని అన్నారు. యువతలో ఉన్న క్రీడా ఆసక్తిని, క్రీడాశక్తిని, పెంపొందించడం కోసం సీఎంకప్ క్రీడోత్సవాలను మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ప్రతిభను ప్రదర్శించాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా,  గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి అవ్వాలన్న యువత పాత్ర అత్యంత కీలకమైందని ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించాలని ఆయన కోరారు. నేటి యువత చెడుఅలవాట్లకు దూరంగా ఉండాలని, జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, మహబూబాబాద్ ఎంపీపీ మౌనిక, జెడ్పిటిసి ప్రియాంక, మున్సిపల్ కమీషనర్ ప్రసన్నరాణి, భారాస యువజనవిభాగం అద్యక్షులు యాళ్ళ మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్ సూర్నపు సోమయ్య జెడ్పీసిఈఓ రమాదేవి, జిల్లా క్రీడాధికారి అనీల్  తదితరులు పాల్గొన్నారు